హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నేతలను నేరుగా ఎదుర్కోవాలనుకుంటే జర్నలిజం ముసుగు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చి నేరుగా తలపడాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సవాల్ చేశారు. కానీ, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద వ్యక్తిగత ప్రతిష్ఠను మలినపరిచే నిరాధార వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఆదివారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతున్న క్రమంలో ఒక మీడియా యాజమాన్యం, ప్రతినిధులు పనిగట్టుకొని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై వ్యక్తిగతంగా ఇష్టమొచ్చినట్టు విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మీడియా ముసుగులో తమ నాయకులపై అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తే పార్టీ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు ఊరుకోబోరని, వారు ఏమైనా చేయవచ్చని చెప్పారు. మీడియా ముసుగులో మీరు మీ పరిధులు దాటితే తాము కూడా పరిధులు దాటాల్సి వస్తుందని హెచ్చరించారు.
చెల్లికి మళ్లీ పెండ్లిలా.. అమిత్‌షా ప్రోగ్రాం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరు సినిమాలో తనికెళ్ల భరణి చెప్పే కవిత్వం లాగా.. ‘మా చెల్లికి పెండ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ..’ అన్నట్టుగా ఉన్నదని వేముల ప్రశాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నిజామాబాద్‌లో జనవరిలోనే ప్రారంభించిన పసుపుబోర్డు తాతాలిక కార్యాలయాన్ని మరొక కిరాయి భవనంలోకి మార్చి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో మళ్లీ ప్రారంభిస్తుంటే జిల్లా పసుపు రైతులు నవ్వుకుంటున్నారని విమర్శించారు. పసుపు రైతులకు కావాల్సింది కార్యాలయాలను మళ్లీ మళ్లీ ప్రారంభిస్తూ ఏమార్చడం కాదని, పసుపు పంటకు మద్దతు ధర అని స్పష్టంచేశారు. పసుపుబోర్డు ప్రకటించి చేతులు దులుపుకుంటే సరిపోదని, సిబ్బంది, పాలకవర్గాన్ని నియమించడంతోపాటు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. వచ్చే సీజన్ నుంచే పసుపు పంటకు ఎంఎస్పీ ప్రకటించి రూ.15 వేల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, బీఆర్ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.