హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): రైతులను నిండా ముంచి మోసం చేసినందుకు సంబురాలు చేసుకోవాలా? అని సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో మండిపడ్డారు. నేడు రాష్ట్రంలో సగం మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినందుకు సంబురాలు చేసుకోవాలా? ఏడాదిన్నర పాలనలో 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందుకు చేసుకోవాలా? అని మంగళవారం ఒక ప్రకటనలో ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రైతుభరోసా వేసి సంబరాలు చేసుకోవాలనడాన్ని రైతులు ఎన్నికల స్టంట్‌గానే చూస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతును రాజుగా చేయాలన్న సంకల్పంతో నాడు కేసీఆర్ పెట్టుబడి సాయాన్ని ప్రారంభించారని ఆయన గుర్తుచేశారు.
రైతుభరోసా నాలుగు విడతలు ఎగ్గొట్టినందుకు సంబరాలు చేసుకోవాలా? అని బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎకరాకు రూ.15 వేలు రైతు భరోసా ఇస్తామని చెప్పి మోసం చేసినందుకా? రూ.2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినందుకు సంబరాలు చేసుకోవాలా? అని మండిపడ్డారు. లగచర్ల, పెద్ద ధన్వాడ రైతులకు బేడీలు వేసినందుకు సంబరాలు చేసుకోవాలా? అని ఎద్దేవా చేశారు. నాలుగుసార్లు రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతు పండగ పేరుతో సంబురాలు చేయాలనడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఐదు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో కేసీఆర్‌లాగా ఒక్క పథకం అయినా ప్రవేశపెట్టారా? అని పేర్కొన్నారు.