హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : ‘సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో సభా నాయకుడిలా కాకుండా ఒక ముఠా నాయకుడిలా వ్యవహరిస్తున్నడు. మంత్రి పొంగులేటి అవినీతిని ఆధారాలతో బయటపెట్టిన హరీశ్‌రావును, ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై బురదజల్లు తున్నడు. ఎదురుదాడికి దిగుతూ అడ్డంగా దొరికిపోయిన మంత్రిని కాపాడేందుకు యత్నిస్తున్నడు.. ఆయన సీఎం కాదు.. ముమ్మాటికీ బెదిరింపు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్.. ఆయన దబాయింపులకు మేము భయపడబోము’ అంటూ మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ అక్రమ వ్యవహారం బయటపడగా నే సీఎం అడ్డదిడ్డంగా మాట్లాడుతూ చిందులు తొక్కుతున్నారని మండిపడ్డారు. రెండేండ్లుగా గుర్తుకురాని అంశాలను తెరపైకి తెచ్చి తప్పించుకొనేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం, ఆయన అనుచరుల అక్రమ దందాలను ఓ మంత్రి కూతురే మీడియా ఎదుట బయటపెట్టిందని గుర్తుచేశారు. కానీ రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే బెదిరిస్తున్నారని దబాయించడం దుర్మార్గమని పేర్కొన్నారు.
అసెంబ్లీ సాక్షిగా తన క్యాబినెట్ మంత్రి అడ్డంగా దొరికిపోవడంతో మతితప్పిన సీఎం రేవంత్‌రెడ్డి తలాతోకా లేకుండా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నించారని వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. ‘పొంగులేటి తండ్రి పేరిట ఉన్న రాఘవ కంపెనీతో మంత్రికి సంబం ధమే లేదని, మంత్రి భార్య, తమ్ముడు, తమ్ముడి భార్య, కొడుకు దూరపు బంధువులంటూ మాట్లాడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. మంత్రికి వారు దూరపు బంధువులైతే హరీశ్‌రావుకు తమ్ముడు, బావమరిది దగ్గరి బంధువులెలా అవుతారని నిలదీశారు. గతంలో నల్లమల ఏ బేసిన్లో ఉన్నదని, ఇటీవల ఇక్రిసాట్ అమెరికాదని, సముద్రంలేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అవగాహనాలోపంతో మాట్లాడుతూ రాష్ట్రం పరువు తీశారని మండిపడ్డారు. మతిలేకుండా మాట్లాడుతుంటే సీఎంకు ఏమైందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఎద్దేవా చేశారు.
సీఎం అబద్ధాలు చెప్తుంటే నిలువరించాల్సిన స్పీకర్ వారికే వంతపాడటం దురదృష్టకరమని, ఆయన అసెంబ్లీని నడిపిన తీరు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలా మిగిలిపోయిందని వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మైక్ కోసం మూడు గంటలు నిలబడిన బీఆర్ఎస్ సభ్యులకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తమపై వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఇవ్వడం శోచనీయమని పేర్కొన్నారు. ‘పార్లమెంట్లో రాహుల్‌గాంధీ రఫేల్ డీల్‌పై హౌస్ కమిటీ వేయాలని అడుగొచ్చు కానీ, మేము రాఘవ కంపెనీపై హౌస్‌కమిటీ వేయాలని అడుగొద్దా? కాంగ్రెస్‌ది ఇదేం ద్వంద్వనీతి? తెలంగాణలో ఒక తీరు, ఢిల్లీలో మరోతీరా?’ అని ప్రశ్నాస్ర్తాలు సంధించారు. బీఆర్ఎస్ అవినీతి ఆరోపణలు చేసిన మంత్రిపై రాష్ట్ర పోలీసులు ఎలా విచారణ చేస్తారని నిలదీశారు. అందుకే పొంగులేటి రాజీనామాకు పట్టుబడుతున్నామని స్పష్టంచేశారు.
సభలో నిమిషం కూడా మాట్లాడని కౌశిక్‌రెడ్డిపై చర్యలకు ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయ డం ఎందుకని వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. తొక్కుతా అంటూ సీఎం రేవంత్‌రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలపై ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను గొప్ప మేధావి అని కీర్తించడం కాదు.. దమ్ముంటే చేతల్లో చూపి ఆయనను సీఎం చేయాలని సవాల్ విసిరారు. ‘దళితులకు పదవులిచ్చామని కపట ప్రేమను చూపడం కాదు.. చిత్తశుద్ధి ఉంటే వారి బడ్జెట్ నిధులను ఖర్చుచేయాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి డైవర్షన్ డ్రామాలను దీటుగా ఎదుర్కొంటుందని తేల్చిచెప్పారు.