ఖలీల్‌వాడి, మే 11 : రూ.50 వేలు తీసుకొని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. లబ్ధిదారులను కాంగ్రెస్ పార్టీ నేతలు తమ ఇండ్లల్లో కూర్చొని ఎంపిక చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే, ప్రజలు నమ్మి ఓటు వేశారని తెలిపారు. అధికారంలోకి వచ్చి 17 నెలలవుతున్నా దసరా, సంక్రాంతి అంటూ మాటలు చెప్తూ వాయిదా వేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు. నిజామాబాద్ జిల్లాలో 1.8 లక్షల మంది పేదలు ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. కాంగ్రెస్ నేతలు ఇండ్లల్లో కూర్చొని 70 వేల మందిని ఎంపిక చేశారని తెలిపారు. 70 వేల మంది అర్హులని చెప్పిన కాంగ్రెస్ నేతలే, ఇప్పుడు కేవలం 17 వేల మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిన జీవో 7 ప్రకారం గ్రామసభల ద్వారా అర్హులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు ఎంపిక చేస్తే పేదలతో కలిసి పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
కాంగ్రెస్ నేతల జేబులు నింపుకోవడానికి రాజీవ్ యువవికాసం పథకం ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే వేముల విమర్శించారు. డబ్బులు ఇచ్చిన వారికి, కాంగ్రెస్ కార్యకర్తలకే ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు మాత్రమే రాజీవ్ యువ వికాసం పథకం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ బహిరంగంగా చెప్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడిన వీడియోను వేముల మీడియా ముందు ప్రదర్శించారు.