హైదరాబాద్ మార్చి 15 (నమస్తే తెలంగాణ): పదవులను త్యజించి, 14 ఏండ్లు పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసహనంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన ఆ మహానేత చావును రేవంత్ కోరుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. అక్కసు, అభద్రతాభావంతోనే దిగజారి జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారని, ఇందుకు నిరసనగానే సీఎం ప్రసంగాన్ని బహిష్కరించామని చెప్పారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌తో కలిసి వేముల మాట్లాడారు.
అసెంబ్లీలో సభాపక్షనేతకు ఎంతటి గౌరవముంటుందో ప్రతిపక్ష నేతకు కూడా అంతే గౌరవం ఉంటుందని చెప్పారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ప్రతిపక్ష నేతకు సరైన చాంబర్ కేటాయించకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. ఫిరాయించిన ఎమ్మెల్యేను పీఏసీ చైర్మన్‌గా నియమించి కుసంస్కారాన్ని చాటుకున్నదని దుయ్యబట్టారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ లేవనెత్తిన ఏ ఒక్కప్రశ్నకు కూడా ముఖ్యమంత్రి, మంత్రులు సమాధానాలు చెప్పకుండా దాటవేశారని విమర్శించారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలుచేస్తామని చెప్పి గద్దెనెక్కిన ఆయన పవిత్రమైన అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పారని నిప్పులు చెరిగారు.
రేవంత్ పాలనలో అన్ని వర్గాలు ఆగమయ్యాయని, నీళ్లులేక పంటలు ఎండిపోతుంటే రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని వేముల వాపోయారు. వారి వేదనను, సర్కారు ఆగడాలను మీడియా ద్వారా కళ్లకు కడుతున్న జర్నలిస్ట్‌లను జైలులో పెడుతూ కాంగ్రెస్ నేతలు రాక్షసానందం పొందుతున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా జర్నలిస్ట్‌లపై దాడులను ఆపి పాలనపై దృష్టిపెట్టాలని హితవు పలికారు.
రుణమాఫీ, బిల్లుల చెల్లింపుపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉట్టిమాటలు చెప్పారని ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. రైతులందరికీ రుణమాఫీ చేశామని అసత్యాలు చెప్పడం దుర్మార్గమని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో రెండు విడుతల్లో రూ. 29 వేల కోట్లు రుణమాఫీ చేశామని తెలిపారు. ఈ విషయాన్ని కప్పిపుచ్చి తామే ఎక్కువ చేశామని తప్పుడు లెక్కలు చెప్తున్నారని విమర్శించారు. దీనిని తాను నిరూపిస్తానని, లేకుంటే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. నిజంగా భట్టికి దమ్మూధైర్యం ఉంటే తన సవాల్‌ను స్వీకరించాలని, లేదంటే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 31వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. రుణమాఫీపై ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యలతో కంగుతిన్న అధికారపక్ష సభ్యలు రన్నింగ్ కామెంటరీతో ఎదురుదాడికి దిగారు. దీనికి ధీటుగా స్పందించిన వేముల ‘మేం ఏం చేశామనేది గతం.. ఇప్పుడు మీరేం చేస్తున్నారో చెప్పుమంటే మా మీద ఏడ్వడందేనికి’ అంటూ ప్రశ్నించారు. ‘మీరు అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. ఈ 15 నెలలుగా మీరు మా మీద ఏడుస్తనే ఉన్నారు. ఇంకెంతకాలం ఏడుస్తరు?’ అంటూ దెప్పిపొడిచారు.
తన నియోజకవర్గంలో మొత్తం 51 వేల మంది రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉంటే, ఇప్పటి వరకు 20 వేల మందికే అమలైందని, ఇంకా 31 వేల మందికి మాఫీ కాలేదని తెలిపారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ముందుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కల్పించుకుని తాము పూర్తిస్థాయిలో రుణమాఫీ చేశామని చెప్తూనే, నియోజకవర్గాల వారీగా లబ్ధ్దిదారుల సంఖ్యను వినిపించారు. దీనిపై స్పందించిన వేముల తన నియోజకవర్గంలోనే 31 వేల మందికి రుణమాఫీ కాలేదని తెలిపారు. తాము రెండు విడుతల్లో చేసిన రుణమాఫీ కంటే ప్రస్తుత కా్రంగెస్ సర్కారు చేసిన రుణమాఫీ చాలా తక్కువని, ఏదో కొంత మొత్తం చేసి గొప్పలు చెప్పుకోవడం తగదని, తాను చెప్పింది అవాస్తవమైతే పూర్తి వివరాలను సభలో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఉద్దేశించి వేముల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తరుచూ భట్టి విక్రమార్క లేచి సమాధానాలివ్వడం పట్ల వేముల సెటైర్లు వేశారు. ‘గవర్నర్ ప్రసంగం మీద సీఎం రేవంత్‌రెడ్డి సమాధానమివ్వాల్సి ఉండగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు లేచి మాట్లాడుతున్నారు. క్రెడిట్ అంతా భట్టి విక్రమార్క గారు కొట్టేయాలనుకుంటున్నారా? పరిస్థితి చూస్తుంటే అట్లనే ఉన్నది. అయినా వారిద్దరి మధ్య పంచాయితీ నాకెందుకు’ అంటూ ఎద్దేవాచేశారు.
అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగంలో దశ, దిశ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, సంజయ్, విజయుడుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో 2 లక్షల విద్యార్థులు డ్రాపౌట్ అయినట్టు తెలిపారు. గురుకులాల్లో విద్యార్థులు చనిపోతే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 11 వేల ఉద్యోగాలు ఇచ్చి, 50 వేలు ఇచ్చామని ప్రగల్భాలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాల్సి ఉన్నదని సష్టంచేశారు.
విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో విద్య పూర్తిగా భ్రష్టుపట్టిందని విమర్శించారు. గాంధీభవన్‌లో మాట్లాడినట్టు సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారని ఎద్దేవా చేశారు. సీఎం తీరు నచ్చక రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నట్టు ఆవేదన వ్యక్తంచేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే రేవంత్‌రెడ్డి తీరును తప్పుపడుతున్నట్టు పేర్కొన్నారు. రూ.1.58 లక్షల కోట్లు అప్పు చేసినా.. ఏ వర్గానికీ సంక్షేమ పథకాలు అందలేదని ఆరోపించారు. కేసీఆర్ సుదీర్ఘ పోరాటంతోనే రాష్ట్రం వచ్చిందని గుర్తుచేశారు. ఇచ్చిన హామీలను అమలుచేయకుండా.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారని, బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి వేరు చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ తల్లిని మారుస్తామని తెలిపారు.