కంఠేశ్వర్, జూన్ 22: రైతు మోసకారి రేవంత్ సర్కార్ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ ప్రభుత్వం ఓట్ల సమయంలో
నామమాత్రంగా పథకాలు అమలు చేస్తూ .. ఓట్లు లేని సమయంలో ఎగ్గొడుతూ రైతులను మోసం చేస్తున్నదని మండిపడ్డారు.
రైతులకు నేరుగా నగదు బదిలీ పథకం కేసీఆర్ మొట్టమొదటిసారిగా రైతుబంధు ప్రారంభించారని గుర్తుచేశారు. రైతు నాట్లువేసే సమయంలోనే ప్రతి పంటకు రైతుబంధు ఇచ్చే వారని
గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ నుంచి ఇప్పటివరకు నాలుగు పంటలు రాగా మొదటి పంట సమయంలో ఎంపీ ఎన్నికలు రావడంతో ఓట్ల కోసం మ్యానిఫెస్టోలో చెప్పినవిధంగా రైతుభరోసా రూ.15వేలు కాకుండా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన పాత రైతుబంధు పథకాన్నే అమలు చేశారని గుర్తుచేశారు.
రెండో పంట సమయంలో ఎన్నికలు లేకపోవడంతో రైతుబంధు ఎగ్గొట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మూడోసారి కూడా ఎన్నికలు లేకపోవడంతో కొంతమందికే ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు నాలుగోసారి పంట సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు ముందుండటంతో ఓట్ల కోసం మభ్యపెట్టడానికి రైతుభరోసా
ఇస్తున్నారని ఆరోపించారు.
మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రకారం రూ.రెండు లక్షల రుణమాఫీ చేయకపోగా.. ఎంపీ ఎన్నికల సమయంలో ఊరూరా తిరుగుతూ కనిపించిన ప్రతి దేవుడిపై ఒట్టు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఎంపీ ఎన్నికలు పూర్తవగానే కాలయాపన చేస్తూ .. చివరికి బీఆర్ఎస్ ఒత్తిడికి తట్టుకోలేక సగం మందికి రుణమాఫీ చేశారని
తెలిపారు. ఐదెకరాలున్న సగం మందికి రైతుభరోసా ఎగ్గొట్టిందని చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో జీలుగ ధర రూ.1,150 ఉండగా ప్రస్తుత ప్రభుత్వం రూ. 2,140కి పెంచిందని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు రాయితీపై విత్తనాలు ఇచ్చేదని.. ప్రస్తుతం ఏ విత్తనం కూడా రాయితీపై ఇవ్వడం లేదని చెప్పారు. మూడు దఫాలుగా ఎగ్గొట్టిన వడ్ల బోనస్, రైతుభరోసా,
రుణమాఫీ బకాయిలు ఇచ్చాకనే.. స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడగడానికి రావాలని, లేనిపక్షంలో ప్రజలు తరిమికొడుతారని హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పోలీస్ ఇన్వెస్టింగ్ అధికారిగా.. కేటీఆర్‌ను జైలుకు పంపడమే లక్ష్యంగా మాట్లాడుతున్నారని, ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టే
కార్యక్రమాలు ఎక్కువ రోజులు సాగవని తెలిపారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఫోన్‌ట్యాపింగ్ కేసు విచారణలో ఉండగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడందారుణమని మండిపడ్డారు. విద్వేషపూరిత రాజకీయాలు మానుకోనిపక్షంలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్కటే
అని, అందుకే బీజేపీ ఎంపీలు ఉన్న చోట మంత్రి పదవులు ఇవ్వడంలేదని వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు.