హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): తాలిబన్ సంస్కృతికి వారసుడిలా సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డికి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడానికి సర్కారుకు భయమెందుకు? అని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. గురువారం తెలంగాణభవన్‌లో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కే సంజయ్, మర్రి రాజశేఖర్‌రెడ్డితో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలో ఆడబిడ్డల పట్ల సీఎం రేవంత్‌రెడ్డి అమానుషంగా వ్యవహరించారని వేముల మండిపడ్డారు.
అహంకారిగా, అపరిచితుడిగా, అజ్ఞాని, ఫ్యాక్షనిస్ట్, ఫ్యూడల్‌గా వ్యవహరిస్తున్నారని సీఎంపై విరుచుకుపడ్డారు. డీకే అరుణపై వాడిన పరుష పదజాలం నుంచి మొదలుకొని.. సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి దాకా మహిళలను అగౌరపరచిన చరిత్ర రేవంత్‌ది అని దుయ్యబట్టారు. సభలో మహిళా సభ్యులు నాలుగున్నర గంటలపాటు నిలబడే ఉన్నా మా ట్లాడే అవకాశం ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. రేవంత్‌రెడ్డికి కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కులేదని, కేసీఆర్ కాలి గోటికి రేవంత్ సరిపోరని పేర్కొన్నారు. 2009లో బీఆర్ఎస్తో టీడీపీ పొత్తుపెట్టుకోవటం వల్లే ఎమ్మెల్యే అయ్యారనే విషయాన్ని రేవంత్ గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు.
అసెంబ్లీలో దుశ్శాసనపర్వం నడుస్తున్నదని జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డికి మహిళలంటే కనీస గౌరవం లేదని మరోసారి స్పష్టమైందని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలను సభలో ప్రస్తావించారన్న అక్కసుతో సబితాఇంద్రారెడ్డిపై సీఎం తన అక్కసును వెళ్లగక్కారని మండిపడ్డారు. సీఎం వ్యాఖ్యల వల్లే బయ ట అఘాయిత్యాలు జరుగుతున్నాయని తెలిపారు. సీఎం ఆగ్రహంతో మాట్లాడితే ఉపముఖ్యమంత్రి భట్టి పెద్దరికంగా వ్యవహరిస్తారని అనుకున్నా నిరాశే ఎదురైందని.. నిజానికి సీఎం మీద ఉన్న కోపాన్ని డిప్యూటీ సీఎం సబితాఇంద్రారెడ్డిపై ప్రదర్శించారని ఆరోపించారు.
ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసి అసువులు బాసిన అమరులకు సుప్రీంకోర్టు తీర్పు అంకితంగా భావిస్తున్నామని జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి.. ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వర్గీకరణకు మద్దతు ఇచ్చిన సందర్భాలను గుర్తుచేశారు. అసెంబ్లీలో రెండుసార్లు సభ ఏకగ్రీవ తీర్మానం చేశారని, ఈ అంశంపై కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీని కలిసిందని, ఎస్సీ వర్గీకరణ పోరులో ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబాలకు బీఆర్ఎస్ సర్కారు ఆర్థిక సాయాన్ని అందించిన విషయాన్ని గుర్తుచేశారు.