హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తేతెలంగాణ): ‘తొమ్మిదేండ్ల క్రితం కేంద్రంలోని ఇదే బీజేపీ సర్కార్ జీఎస్టీని తెచ్చి రూ.100 లక్షల కోట్ల దోపిడీ చేసింది. అందులో కొంత తగ్గించి మెహర్బానీ చేసినట్టు ఇప్పుడు ప్రధాని మోదీ ఫొజులు కొడుతున్నారు. మొత్తం జీఎస్టీ రూ.22 లక్షల కోట్లల్లో కేవలం రూ.2 లక్షల కోట్లు తగ్గించి, దసరా కానుక అంటూ మోదీ మొసలి కన్నీరు కారుస్తున్నారు’ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. మరీ ఇన్నాళ్లు జీఎస్టీ పేరిట చేసిన పన్ను వసూళ్లపై ప్రజలకు ఏం సమాధానం చెప్తారని బుధవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
నిజామాద్ ఎంపీ అర్వింద్ తెలంగాణలోని ప్రతి వ్యక్తికి ప్రతినెలా కనీసం రూ.5వేల చొప్పున తాము మిగిల్చామనడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. ఈ తొమ్మిదేండ్లలో ప్రతి నెలా రూ.5 వేల చొప్పున రూ.5.40 లక్షలు దోపిడీ చేసినట్టు ఆయన అంగీకరించినట్టే కదా? అని ప్రశ్నించారు. జీఎస్టీ తగ్గించి కేంద్రం ప్రతినెలా ఒక్కో కుటుంబానికి రూ.15 వేలు మిగిల్చామని బీజేపీ మరో ఎంపీ రఘునందన్‌రావు చెప్పుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఇన్నేండ్లు రూ.15వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం దోపిడీ చేసిందని ఒప్పుకున్నట్టేనని వేముల విమర్శించారు.
అసలు నాడు బీజేపీ ప్రభుత్వాన్ని జీఎస్టీ తెమ్మన్నది ఏవరు? ఇప్పుడు అదే ప్రభుత్వాన్ని తగ్గించమన్నది ఎవరు?’ అంటూ ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నాస్త్రాలను సంధించారు. 2017 నుంచి జీఎస్టీ రూపంలో సబ్బు మొదలుకొని సైకిల్ మోటర్ దాకా ధరలు పెంచి ప్రజలను పీడించింది బీజేపీ ప్రభుత్వాలు కాదా? అని నిలదీశారు. మాయమాటలతో దేశ ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తారని ప్రశ్నించారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు మీ ఝుటా మాటలకు తగిన గుణపాటం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.