వేల్పూర్, ఏప్రిల్ 14: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతో పాటు కాంగ్రెస్ ఇస్తామన్న తులం బంగారాన్ని వెంటనే అందజేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్‌చేశారు. సోమవారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లి కష్టాలు తెలిసిన నాయకుడిగా కేసీఆర్ కల్యాణక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రారంభించి రూ.లక్ష చొప్పున సాయం అందజేశారని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు చెక్కులు అందుకున్న ప్రతీ ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్‌చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో ఆడబిడ్డలకు 847 చెక్కులు మంజూరయ్యాయని, వాటిని ఆలస్యం చేయకుండా గ్రామకార్యదర్శుల ద్వారా పంపిణీ చేయాలని నెల క్రితమే ఆర్డీవోకు లేఖ రాశానని చెప్పారు.
మూడ్రోజుల క్రితం ఆర్డీవో కాల్ చేసి.. ఇన్చార్జి మంత్రి వస్తున్నారని, ఆయన చేతుల మీదుగా చెక్కుల పంపిణీ చేయనున్నట్టు చెప్పారని తెలిపారు. జీవో 18 ప్రకారం చెక్కుల పంపిణీ అధికారం ఎమ్మెల్యేది అయినా ఇన్చార్జి మంత్రి మీద గౌరవంతో నియోజకవర్గంలోనే ఉన్నానని తెలిపారు. చెక్కుల పంపిణీ కార్యక్రమం రద్దయిందని అధికారులు ఇప్పుడు సమాచారమిచ్చారన్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు అధికార దర్పం కోసం పేదింటి ఆడబిడ్డలకు చెక్కులు అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు. చెక్కుల పంపిణీ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు.