మోర్తాడ్/ముప్కాల్, నవంబర్ 24 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేసిన పథకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కోతలు విధిస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో సోమవారం ఆయన చేపపిల్లలు విడుదల చేశారు. అనంతరం బాల్కొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముప్కాల్ మండలానికి చెందిన 24 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి అన్ని పథకాల్లో మాదిరిగానే చేపపిల్లల పంపిణీలో కూడా కోతలు పెడుతున్నారని ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉచితంగా చేపపిల్లల సరఫరా, మత్స్యకారులకు టీవీఎస్ స్కూటీ లు, వలలు, మొబైల్ ఫిష్‌మార్కెట్ వాహనాలు, బాల్కొండలో రూ.72 లక్షలతో 8 మత్స్య సహకార సంఘభవనాలు, రూ. 10 లక్షలతో ఫిష్‌మార్కెట్, 19 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.77లక్షల విలువ చేసే ఇన్సూరెన్స్ చెక్కులను అందజేశామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుడు కోటీ 74 లక్షల చేపపిల్లలకు 83 లక్షలు మాత్రమే సరఫరా చేసిందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు ఇవ్వలేదని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం కింద మహిళలకు చెక్కుతోపాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని పేర్కొన్నారు. రానున్న సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.