రామారెడ్డి (సదాశివనగర్), ఏప్రిల్ 9 : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ వెనుకబడిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ర్టాన్ని నడిపించలేని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ పురోగమనంలో ఉంటే, రేవంత్ హయాంలో రాష్ట్రం తిరోగమన బాట పట్టిందని ఆవేదన వ్యక్తంచేశారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో బుధవారం ఎల్లారెడ్డి నియోజకవర్గ ముఖ్యనేతలతో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌తో కలిసి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు.
ఈ నెల 27న నిర్వహించనున్న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి సభకు కామారెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధి రేటు దేశంలోనే మొదటి స్థానంలో ఉండేదని, కాంగ్రెస్ పాలనలో ఇప్పుడది 11వ స్థానానికి పడిపోయిందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో జీఎస్డీపీ వృద్ధి రేటులో మూడో స్థానంలో ఉంటే, ఇప్పుడది 14వ స్థానానికి దిగజారిందన్నారు. వరినాట్లు వేసే సమయంలోనే కేసీఆర్ రైతుబంధు వేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్నికలు ఉన్నప్పుడే రైతుబంధు వేస్తున్నదని విమర్శించారు. తెలంగాణను ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు గూబ గుయ్యిమనేలా వరంగల్ సభతో సమాధానమిస్తామని తెలిపారు. బీఆర్ఎస్కు రాజకీయం ఒక టాస్క్ అని, మిగతా పార్టీలకు వ్యాపారమని అన్నారు.