మోర్తాడ్, జూన్ 23: అధికార మదంతో విర్రవీగుతున్న నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ అహంకారాన్ని ప్రజలు త్వరలోనే పాతాళానికి తొక్కేస్తారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అర్వింద్ చేసిన వ్యాఖ్యలను ఆయన సోమవారం ఓ ప్రకటనలో ఖండించారు. ఐదు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉండి, చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన గొప్ప వ్యక్తిని విమర్శించడానికి ఎంపీ అర్వింద్‌కు ఏమాత్రం అర్హత లేదని మండిపడ్డారు.
తండ్రి వయసున్న కేసీఆర్‌పై, తెలంగాణ ఉద్యమకారులైన కేటీఆర్, హరీశ్‌రావు, కవితపై వ్యక్తిగత హననం చేస్తూ అర్వింద్ చేసిన దిగజారుడు వ్యాఖ్యలు ఆయన స్థాయిని సూచిస్తున్నాయని చెప్పారు. సింహం లాంటి కేసీఆర్ పై గాడిదలాగా ఓండ్ర పెడుతున్న అర్వింద్ అహంకారాన్ని ప్రజలు తొందరలోనే పాతరేస్తారన్నారు.
‘మీ నాన్న డీ శ్రీనివాస్ రాజకీయంగా సమాధి అనుకున్న సమయంలో మళ్లీ ఎంపీని చేసి వెలుగులోకి తెచ్చింది కేసీఆర్’ అని గుర్తు చేశారు. నీ మొఖానికి ఎవరు ఓట్లు వేయరని ‘నన్ను చూసి కాదు.. మోదీని చూసి బీజేపీకి ఓట్లు వేయండి’ అని అడుక్కొని యాక్సిడెంటల్ ఎంపీ అయిన విషయం గుర్తులేదా? అని ప్రశ్నించారు. ’బనకచర్ల’ను జనకచర్లగా అనడం, ఇరిగేషన్‌పై అవగాహన లేకుండా అర్వింద్ మాట్లాడిన మాటలతోనే ఆయన స్థాయి ప్రజలకు అర్థమైందన్నారు.