హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): యాభై ఏండ్ల పాలనలో తెలంగాణ నీటి పారుదల రంగాన్ని, సాగు రంగాన్ని నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. అప్పుడూ, ఇప్పుడూ ఎప్పుడూ కాంగ్రెస్‌ది ద్రోహచరిత్రేనని విమర్శించారు. ‘ఎవర్ని కొరడా దెబ్బలు కొట్టాలె.. రేవంత్‌రెడ్డీ? ద్రోహం చేసింది ఎవరు.. కొరడా దెబ్బలు తినాల్సింది ఎవరు?’ అని ప్రశ్నించారు. గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణ వాటాను ఆంధ్రాకు అప్పజెప్పిన కాంగ్రెస్ నాయకులను కొరడా దెబ్బలు కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజాభవన్‌లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అజ్ఞానం మరోసారి బయటపడిందని విమర్శించారు. పదవుల కోసం పెదవులు మూసుకొని ఆంధ్రాకు దాసోహం అన్నది నాడు మంత్రులుగా ఉన్న నేటి మంత్రులేనని, ఇప్పుడు కూడా మళ్లీ అదే రీతిలో ఆంధ్రాకు నీళ్ల తరలింపులో తోడ్పాటు అందిస్తున్నారని గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
మేడిగడ్డ బరాజ్ పిల్లర్లను రిపేర్ చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) చెప్పినా, ఎల్అండ్టీ రిపేరుకు సిద్ధపడినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మరమ్మతులు చేయించడం లేదని ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. అప్పుడు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పడావు పెట్టారని, ఇప్పుడు మేడిగడ్డను పడావు పెడుతున్నారని విమర్శించారు. రైతు ప్రయోజనాల కంటే మీకు రాజకీయ ప్రయోజనాలే ఎకువా? అని ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో 299:512 వాటాకు రాష్ట్రం ఏర్పడక ముందే ఒప్పుకొని మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ అని, ఆనాటి కాంగ్రెస్ చేసిన తప్పులకు తెలంగాణ ఇప్పటికీ శిక్ష అనుభవిస్తున్నదని విమర్శించారు. సెక్షన్-3ని కేసీఆర్ సాధించారని, ట్రిబ్యునల్ ముందు 573 టీఎంసీలకు అఫిడవిట్ ఇచ్చారని గుర్తుచేశారు. ‘గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణ వాటాను ఆంధ్రాకు అప్పజెప్పిన కాంగ్రెస్ నాయకులను కొరడా దెబ్బలు కొట్టాలె. కృష్ణా నీళ్లను పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు తరలిస్తుంటే హారతులు పట్టిన ఆనాటి కాంగ్రెస్ మంత్రులను కొట్టాలె. బనకచర్ల ద్వారా ఏపీకి గోదావరి, కృష్ణా నీళ్లను దారాదత్తం చేసేందుకు కుట్రలుచేస్తున్న నిన్ను కొరడా దెబ్బలు కొట్టాలె రేవంత్‌రెడ్డీ’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.