హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడిన ప్రస్తుత తరుణంలో మరోసారి ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైనదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. జయశంకర్‌సార్ స్ఫూర్తితో పోరాడి కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణను కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ 15వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌అలీ, వీ శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్, సుమిత్రా ఆనంద్, ఉపేంద్ర, కురువ విజయ్‌కుమార్, గౌతం ప్రసాద్, సత్యవతి తదితరులు జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన మహనీయుడు జయశంకర్ సార్ అని కొనియాడారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వేల విగ్రహాలు ఏర్పాటు చేసి, అగ్రి యూనివర్సిటీకి అయన పేరుపెట్టి గొప్పగా గౌరవిం చామని గుర్తుచేశారు. జయశంకర్‌సార్ భౌతికంగా తమ మధ్యలేకపోయినా ఆయన స్ఫూర్తి ప్రేరణగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ఆయన జీవితం.. ఆచరించిన సిద్ధాంతం నేటి తరానికి ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఆ మహనీయుడి ఆశయసాధనకు మనందరం పునరంకితమవుదామని పేర్కొన్నారు.