హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేసినట్టు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో అందమైన అబద్ధాలు మాట్లాడించారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. రేవంత్‌రెడ్డి రాసిచ్చిన పేపర్ చదవటం కాదు ఖర్గేజీ.. క్షేత్రస్థాయిలో తిరిగి మీ కాంగ్రెస్ పాలనపై ప్రజలేమనుకుంటున్నారో ఆరా తీస్తే నిజాలు తెలుస్తాయని హితవుపలికారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక టి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేయ డం లేదని శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు.
కేసీఆర్ పెట్టిన క్యాంటీన్లకు పేర్లు మార్చడం, కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ల ఉద్యోగాలకు నియామకపత్రాలు అందజేసి తామే 60 వేల మందికి ఉపాధి కల్పించామని చెప్పడం, కేటీఆర్ హయాంలో కట్టించిన ఫ్లైఓవర్లను ప్రారంభించి కాంగ్రెస్ గొప్పగా చెప్పుకోవడం.. మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని ముద్దాడినట్టుగా ఉన్నదని ఎద్దేవా చేశారు. మీరు నిజంగా ఉద్యోగాలు ఇచ్చి ఉంటే నిరుద్యోగులు ఈ రోజు నిరసనకు ఎందుకు పిలుపునిచ్చారు? అని ప్రశ్నించారు.
ప్రజాపాలన అంటున్న మీరు వారిని ఎందుకు అరెస్ట్ చేశారు? అని నిలదీశారు. వేదిక ఏదైనా కేసీఆర్ మీద పడి ఏడవటం తప్ప సీఎం రేవంత్‌రెడ్డికి పాలన చేతకాదని విమర్శించారు. ప్రజలు చీదరించుకొంటున్నా కూడా బట్టలూడ దీసి కొడతాం, పేగులు మెడలో వేసుకుంటాం, నాలుక చీరేస్తాం.. అంటూ రేవంత్‌రెడ్డి బజారు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.