ఈ నెల జీతాలివ్వలేని పరిస్థితి ఉంటే రిజర్వ్బ్యాంక్లో తలతాకట్టుపెట్టి రూ.నాలుగు వేల కోట్లు తెచ్చి జీతభత్యాలిచ్చాం. మీరేమో డీఏలు, కరువుభత్యాలు అడుగుతున్నరు.
– సీఎం రేవంత్రెడ్డి
Revanth Reddy | హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్ర ఖజానా మొత్తం ఉద్యోగులకు అప్పగిస్తం.. ఎట్లా పంచాల్నో మీరే చెప్పండి’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘పైసా పైసా మొత్తం లెక్క అప్పజెప్త. ఒక్క పైసా నా దగ్గర పెట్టుకోకుండా మొత్తం ప్రభుత్వ ఉద్యోగులకు అప్పజెప్త. ఆఖరికి నా నెల జీతం కూడా మీకే ఇస్త్త.. ఏది ఎట్ల పంచాల్నో మీరే చెప్పండి?’ అంటూ ఆయన ఉద్యోగులపై అసహనం వ్యక్తంచేశారు. ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించబోమనుకుంటే జీతాలివ్వలేమని పరోక్షంగా హెచ్చరించారు.
బుధవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఇంటర్ విద్యలో ఎంపికైన 1,292 మంది జూనియర్ లెక్చరర్లు, సాంకేతిక విద్యాశాఖలో ఎంపికైన 240 మంది పాలిటెక్నిక్ లెక్చరర్లకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ‘ఒకటో తేదీన జీతాలివ్వకపోతే ఏ యజమాని మీద, ఏ ప్రభుత్వం మీద ఎందుకు విశ్వసముంటది? ఎందుకు నమ్మకంగా పనిచేస్తరు? ఔను. కొన్ని సమస్యలున్నాయి. చర్చల అనంతరం, ఆయా సమస్యలు పరిష్కారం కాలేదని ఉద్యోగులెవరైనా ప్రభుత్వానికి సహకరించబోమని అనుకుంటే మన పరిస్థితి ఇంకా దిగజారిపోయి, నెలనెల జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది’ అని హెచ్చరించారు.
‘ఈ నెల జీతాలివ్వలేని పరిస్థితి ఉంటే రిజర్వ్బ్యాంక్లో తలతాకట్టుపెట్టి 4వేల కోట్లు తెచ్చి జీతభత్యాలిచ్చాం. మీరేమో డీఏలు, కరువుభత్యా లు అడుగుతున్నరు’ అని వ్యాఖ్యానించారు. ఆదాయం సరిపోక, జీతాలు, బిల్లులు పెండింగ్లో పెడుతున్నామని, ఓనెల ఆశ వర్కర్ల జీతాలు, మరో నెల అంగన్వాడీ వర్కర్ల జీతాలు, షాదీముబారక్, కల్యాణలక్ష్మిలు పెండింగ్లో పెట్టి రొటేషన్ చేస్తూ ప్రభుత్వాన్ని నడుపుతున్నామని చెప్పారు.
ఆరు గ్యారెంటీలు, 130 సంక్షేమ పథకాలు అమలుచేయాలంటే ఇప్పుడున్న నెలసరి ఆదాయానికి అదనంగా మరో రూ.22 వేల కోట్లు కావాలని సీఎం రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. ఇప్పుడు నెలకు మిగిలే రూ.5వేల కోట్లతో సర్కారును నడపలేకతున్నామని చెప్పారు. ‘ఆర్థిక పరిస్థితిపై నేను ఎన్నాళ్లు అబద్ధాలు చెప్పాలె. అందుకే వాస్తవాలు చెప్తున్న’ అని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతినెలా రూ.22 వేల కోట్లు అవసరం కాగా, వివిధ మార్గాల ద్వారా రూ.18 వేల కోట్ల నుంచి రూ.18, 500 కోట్ల ఆదాయమే సమకూరుతున్నది. దీంట్లో ఉద్యోగుల జీతభత్యాలకు, పెన్షనర్లకు, అన్నీకలిపి రూ.13 వేల కోట్లు పోతే, మిగిలేది రూ.5 వేల కోట్లే. ఎస్ఎల్బీసీ కూలిపోయింది. కాళేశ్వరం ఆగిపోయింది. రీజినల్ రింగ్ రోడ్డు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇవన్నీ ఇందులో నుంచే తీసి కట్టాలి. రూ.42 వేల కోట్ల బకాయిలున్నా యి. రూ.8 వేల కోట్లు కాంట్రాక్టర్ల బిల్లులు కట్టాలి. ఇవేకాకుండా వివిధ పథకాలకు రూ.22 వేల కోట్లు కావాల్సి ఉన్నది. పరిస్థితి ని అంతా అర్థం చేసుకోవాలి’ అని కోరారు.