Bhupalpally | కృష్ణ కాలనీ, ఫిబ్రవరి 20 : రైతులపై అటవీ అధికారులు దాడికి దిగారు. అటవీ భూముల్లో సాగు చేయొద్దని బూతులు తిడుతూ రైతులను తాళ్లతో కట్టేసి బూటు కాళ్లతో తన్నుతూ వీరంగం సృష్టించారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకున్నది. భూపాలపల్లి మండలం ఆజంనగర్ గ్రామంలోని రైతులు వారి తాత ముత్తాతల నుంచి సాగు చేస్తున్న భూముల్లోకి గురువారం అటవీ అధికారులు జేసీబీలతో వెళ్లారు. ఇవి అటవీ శాఖ భూములని, ఇందులో సాగు చేయొద్దని బూతులు తిడుతూ రైతులను తాళ్లతో కట్టేసి బూటు కాళ్లతో తన్నుతూ నానా బీభత్సం సృష్టించారు. తమ భూములను లాకోవద్దని కాళ్లు మొకినా వినకుండా వాహనాల్లో తీసుకెళ్లారు. కొంతమంది మహిళా రైతులు సృ్పహ కోల్పోవడంతో గ్రామస్థులు వారిని జిల్లా కేంద్రంలోని 100 పడకల దవాఖానకు తరలించారు.
చికిత్స పొందిన మహిళా రైతులు పట్టెం శారద, శ్రీరాముల విజయ మీడియాతో మాట్లాడుతూ.. 40 ఏండ్లుగా తమ తాతముత్తాతల నుంచి 11 మంది రైతులం 25 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నామని, ఈ విషయం అటవీశాఖ అధికారులకు సైతం తెలుసని అన్నారు. గురువారం జిల్లా ఆటవీ శాఖ అధికారి నవీన్‌రెడ్డి 150 మంది సిబ్బందితో వచ్చి బెదిరించినట్టు తెలిపారు. తాము సాగు భూములను జేసీబీలతో తవ్విస్తుండగా, తాము అడ్డుపడగా.. తమను బూటు కాళ్లతో తన్నుతూ తీవ్రంగా గాయపరిచినట్టు చెప్పారు. తాము సృ్పహ కోల్పోయినప్పటికీ పిడిగుద్దులు గుద్దారని ఆవేదన వ్యక్తం చేశారు. కొండి శారద, పొదిళ్ల శ్రీను, పొదిల్లా రజితను తాళ్లతో కట్టేసి అధికారులు వారి వాహనాల్లో తీసుకువెళ్లారని, వారి ఆచూకీ తెలపాలని డిమాండ్ చేశా రు. గత నాలుగేండ్లుగా తమ వద్ద డబ్బులు తీసుకుంటూనే, తమ కొడుకులపై కేసులు పెడతామంటూ బెదిరిస్తున్న అటవీ శాఖ అధికారులను సస్పెండ్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటవీశాఖ అధికారులతో తమకు ప్రాణభయం ఉన్నదని, తమపై దాడులు ఆపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆజంనగర్ ఘటనపై రైతులు, అటవీ అధికారులు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. తమ వాహనాలపై రైతులు దాడి చేశారని అధికారులు, తమపైనే అటవీ అధికారులు విచక్షణారహితంగా దాడి చేశారని రైతులు భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ విషయమై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉషకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు.
కాంగ్రెస్ పాలనలో రైతులకు రక్షణ కరువైందని బీఆర్ఎస్ నాయకుడు గోవిందుల శ్యామ్ ఆరోపించారు. అటవీశాఖ అధికారులు దాడిలో గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్న మహిళా రైతులను ఆయన పరామర్శించారు. రైతులపై అటవీశాఖ అధికారులు విచక్షణారహితంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రైతులను బూటు కాళ్లతో తన్నుతూ తీవ్రంగా గాయపరచడం హేయమైన చర్యగా పేర్కొన్నరు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వెంటనే స్పందించి ఫారెస్ట్ అధికారులు తీసుకువెళ్లిన రైతుల జాడ తెలిసేలా చర్యలు తీసుకోవాలని, రైతులను తాళ్లతో బంధించి, బూటు కాళ్లతో తన్ని దాడి చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.