Telangana | మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న వట్టెం (వెంకటాద్రి) రిజర్వాయర్ పంప్‌హౌస్ నీట మునిగింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు రెండుచోట్ల టన్నెళ్లలోకి భారీగా వరద పోటెత్తింది. సుమారు 20 కిలోమీటర్ల మేర టన్నెళ్ల నిండా వరద నిండిపోయింది. చూస్తుండగానే సర్జ్‌పూల్, పంప్‌హౌస్, దానిలోని పది బాహుబలి మోటర్లు నీట మునిగిపోయాయి. దీంతో నష్టం రూ.వందల కోట్లలో ఉంటుందని ఇంజినీర్లు అంచ నా వేస్తున్నారు. అర్ధరాత్రి కావడం, అదృష్టవశాత్తు పంప్‌హౌస్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీపురం శివారులోని నాగనూలు చెరువు ఉప్పొంగింది.
ఒక్కసారిగా చెరువు బ్యాక్‌వాటర్ పెరగడంతో సమీపంలో ఉన్న పొలాలను వరద ముంచెత్తడంతోపాటు వట్టెం రిజర్వాయర్‌కు నీటిని తరలించే కట్టకు సైతం గండిపడింది. దీంతో టన్నెల్లోకి భారీగా వరద పోటెత్తింది. అంతకుముందు నాగర్‌కర్నూల్ సమీపంలోని కుమ్మెర చెరువు వరద కూడా టన్నెల్లోకి చేరింది. వెంటనే కాంట్రాక్టర్లు అప్రమత్తమై అడ్డుకట్ట వేసి నీటిని నిలిపివేశారు. అయినప్పటికీ, చూస్తుండగానే పంప్‌హౌస్‌లోకి నీరు రావడంతో అధికార యంత్రాంగం షాక్‌కు గురైంది. ఆ వరద ఎక్కడి నుంచి వస్తున్నదో అధికారులు గుర్తించేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరకు ఆ వరద నాగనూలు చెరువు వద్ద నుంచి టన్నెల్లోకి ప్రవేశించి పంప్‌హౌస్‌ను ముంచెత్తుతున్నట్టు గుర్తించిన అధికారులు పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాగనూలు చెరువు బ్యాక్‌వాటర్ టన్నెల్లోకి వెళ్లకుండా ఆపేందుకు స్థానిక అధికారులు మంగళవారం మధ్యాహ్నం నుంచి చర్యలు చేపట్టారు. ఖాళీ సిమెంట్ సంచుల్లో రాక్చిప్స్ను నింపి గండిపడిన టన్నెల్ కట్టకు అడ్డుగా వేస్తున్నారు. చెరువు నుంచి నీరు కిందికి పోకుండా ఉండేందుకు సమీపంలోని బండరాళ్లను క్రేన్ల సాయంతో తెచ్చి కట్టగా నిర్మిస్తున్నారు. ఈ పనులు మంగళవారం సాయంత్రం వరకూ కొలిక్కి రాలేదు. బుధవారం లేదా గురువారం నాటికి నీటి ప్రవాహానికి అడ్డుకట్ట పడే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. టన్నెల్లోకి వెళ్లే నీటి ప్రవాహం నిలిచిపోయాక ఏమిచేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని పాలమూరు ఎత్తిపోతల పథకానికి చెందిన అధికారి ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధికి వివరించారు.
నాగనూలు పెద్ద చెరువు 50 చదరపు కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉంటుంది. దీని పరిధిలో సుమారు 40 చిన్న చిన్న గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. దగ్గర దగ్గరగా ఉన్న ఈ చెరువులన్నీ ఉప్పొంగడంతో అక్కడి నీరంతా నాగనూలు చెరువుకు చేరింది. వరద భారీగా ఉండటంతో అధికారులు సైతం సహాయక చర్యలు చేపట్టలేకపోయారు. సొరంగం తవ్విన ప్రాంతం దిగువన ఉండటంతో చెరువులోని బ్యాక్‌వాటర్ అంతా అడ్డుగా ఉన్న ప్రాంతాన్ని చీల్చుకొని సొరంగంలోకి ప్రవేశించింది. ప్రాథమిక అంచనా ప్రకారం సొరంగంలో దాదాపు 20 నుంచి 22 కిలోమీటర్ల మేర నీళ్లు చేరాయని అధికారులు భావిస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఓ యజ్ఞంలో ప్రారంభించింది. గత డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఈ ప్రాజెక్టు పనులపై దృష్టి సారించడం లేదు. అరకొర నిధులు ఇవ్వడంతో కాంట్రాక్టర్లు, అధికార యంత్రాంగం ఉన్నదాంట్లోనే మందకొడిగా పనులు నిర్వహిస్తున్నారు. వట్టెం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 16 టీఎంసీలు. దీనికి తగ్గట్టుగా పంప్‌హౌస్ నిర్మిస్తున్నారు. ఈ పనులు కూడా దాదాపు పూర్తికావచ్చాయి. ఏదుల రిజర్వాయర్ నుంచి వట్టెం రిజర్వాయర్‌కు మధ్య దాదాపు 25 కిలోమీటర్ల మేర భూగర్భంలో సొరంగం నిర్మించారు.
ఈ మార్గంలో వచ్చిన రాళ్లను బయటికి వెలికి తీసేందుకు మూడుచోట్ల ఎస్కవేషన్ సొరంగాలు ఏర్పాటుచేశారు. నాగనూలు, ఉయ్యాలవాడ, కుమ్మెర గ్రామల సమీపంలో ప్రధాన సొరంగం తవ్వేందుకు వీటిని ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో చెరువులకు సమీపంలో టన్నెల్లోకి వెళ్లే మార్గాలు ఉన్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోపాటు ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు ఇంత పెద్ద మొత్తంలో వరద వస్తుందని అధికారులు ఊహించలేకపోయారు. ఈ నేపథ్యంలో గొలుసుకట్టు చెరువులన్నీ ఉప్పొంగడంతో ఆ వరద టన్నెల్‌ను ముంచెత్తింది.
పాలమూరు ఎత్తిపోతల పథకంలో వట్టెం రిజర్వాయర్ కీలకం. ప్రాజెక్టుల పంప్‌హౌస్‌లను అండర్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేశారు. ఒక్కో పంప్‌హౌస్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుకు మించి భారీ పంపులను బిగించారు. ఒక్కో పంప్‌హౌస్‌లో తొమ్మిది భారీ పంపులు, ఒక స్పేర్ పంపుతో కలిపి పది పంపులు ఏర్పాటు చేశారు. సుమారు రూ.3,000 కోట్లతో ఈ నిర్మాణం జరుగుతున్నది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత పనుల్లో వేగం తగ్గింది. తాజాగా సొరంగంలో వరద నీరు ప్రవేశించడంతో నష్టం రూ.కోట్లల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. వరదతోపాటు బురద కూడా వచ్చే అవకాశం ఉన్నందున ఈ మొత్తం పంపుల్లోకి చేరి భారీ నష్టానికి దారితీస్తుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల (పీఆర్ఎల్ఐ)ను కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఖమ్మం, వరంగల్ వరదల్లో ప్రాణనష్టం సంభవించిందని దుయ్యబట్టారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించింది. వట్టెం వద్ద నిర్మించిన మూడో పంప్‌హౌస్ మెగా కంపెనీ నిర్లక్ష్యంతోనే నీటమునిగింది. వరదలు వచ్చినప్పుడు నీళ్లు పారుతాయని ఈ కంపెనీకి గానీ, అధికారులకు గానీ తెలియదా? లిఫ్ట్ ప్రారంభానికి ముందే ఈ పరిస్థితి రావడం దారుణం. నీటిని ఎత్తిపోసినా కొనుగోలు చేసేటప్పుడు ఉన్నంత సామర్థ్యంతో మోటర్లు పనిచేయవు. సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి మెగా ఏజెన్సీపై, అధికారులపై చర్యలు తీసుకోవాలి.
– నాగం జనార్దన్‌రెడ్డి, మాజీ మంత్రి
వట్టెం పంప్‌హౌస్ నీట మునగడం వెనుక ప్రభుత్వానికి ముందుచూపు లేదన్నది స్పష్టంగా అర్థమవుతున్నది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేయడంలో వెనుకబడిపోయింది. ఇప్పటికైనా వెంటనే నష్టాన్ని అంచనా వేసి పంప్‌హౌస్ పనులు పునరుద్ధరించాలి.
– మర్రి జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే