గజ్వేల్, సెప్టెంబర్ 4: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్‌కు వస్తున్న ఆదరణను సీఎం రేవంత్‌రెడ్డి జీర్ణించుకొలేకపోతున్నాడని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తిలోని కొండపోచమ్మ ప్రాజెక్టుపై గురువారం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ‘ఇది కాదా కాళేశ్వరం.. ఇదే కదా కాళేశ్వరం’ అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వంటేరు మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ అనతికాలంలోనే విఫలమైందనే సంకేతాలు అన్ని వర్గాల ప్రజల నుంచి రావడం.. అదే సమయంలో కేసీఆర్‌కు వస్తున్న మంచి పేరును తట్టుకోలేకపోతుందని విమర్శించారు.
అందుకోసమే ప్రభుత్వం కాళేశ్వరంపై కొత్త నాటకం ఆడుతున్నదని దుయ్యబట్టారు. కూలిందన్న కాళేశ్వరం నుంచి మిడ్‌మానేరు, అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌కు పంపుల ద్వారా నీళ్లు ఎలా వస్తున్నాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి సీఎం, మంత్రుల అబద్దాపు ప్రచారాన్ని ప్రజలు నమ్మేస్థితిలో లేరని అన్నారు. ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ప్రాజెక్టులను సందర్శించి కేసీఆర్ చేపట్టిన బృహత్తర పథకం ఎంతబాగా కన్పిస్తుందో కండ్లు తెరిచి చూడాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 20నెలల్లో ఒక్క ప్రాజెక్టును కూడా నిర్మించలేదని, ఘోష్ కమిషన్ రిపోర్టు ఫేక్ అని దుయ్యబట్టారు.
కేసీఆర్, హరీశ్‌రావులను ఇబ్బందులకు గురిచేసే విధంగా సర్కార్ తప్పుడు నివేదికను తయారు చేయించిందని విమర్శించారు. ఎలాంటి తప్పులు దొరక్కపోవడంతో కాంగ్రెస్, బీజేపీలు జతకట్టి సీబీఐకి కేసును అప్పగించడాన్ని తీవ్రంగా ఖండించారు. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలచే పదవులకు రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ఓడిపోతామనే భయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడం లేదని విమర్శించారు. పెయిడ్ మీడియాను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆత్మగౌరవం మీద దెబ్బకొడుతుందని మండిపడ్డారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు మాదాసు శ్రీనివాస్, కరుణాకర్‌రెడ్డి, దేవీ రవీందర్, రాజమౌళి, జుబేర్‌పాషా తదితరులు పాల్గొన్నారు.