గజ్వేల్, నవంబర్ 1 : తెలంగాణలో కేసీఆర్ చరిత్రను చెరిపివేయడం ఎవరి తరం కాదని బీఆర్ఎస్ గజ్వేల్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేయడం సీఎం రేవంత్‌రెడ్డికి సాధ్యపడదని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలే కనిపిస్తాయని తెలిపారు. తరాలు మారిన కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ ఫలాలు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని అన్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్లు, మిషన్ కాకతీయతో చెరువుల మరమ్మతుతో నిండుకుండలా చెరువులు, కుంటలు కనిపిస్తాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.85 వేల కోట్ల రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంట్, జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ సముదాయాలు, మోడల్ ఐవోసీ మార్కెట్లు, హరితహారంలో 285 కోట్ల మొక్కలు నాటడం, సంక్షేమంలోనే దేశంలో తెలంగాణను నంబర్ వన్‌గా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. అభివృద్ధే ధ్యేయంగా పని చేసిన కేసీఆర్ గుర్తులను చేరిపేయడం రేవంత్‌రెడ్డి తరం కాదని అన్నారు.