హైదరాబాద్ : సిద్దిపేట : రైతుల సాగు కోసం(Cultivation water) తక్షణమే ప్రభుత్వం మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ల ద్వారా ఒక్కో టీఎంసీ చొప్పున కూడవెళ్లి, హల్దీవాగుల్లోకి నీటిని విడుదల చేయాలి. లేని పక్షంలో వచ్చే నెల 2 లేదా 3న రాజీవ్, జాతీయ రహదారులను వేలాది మంది రైతులతో కలిసి దిగ్భందిస్తామని బీఆర్ఎస్ గజ్వేల్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి(Vanteru Pratap Reddy) ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఎంతో మంది రైతుల త్యాగాల ఫలితంగా మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్లను నిర్మించుకున్నామని, వాటి ఫలాలు ప్రతి రైతుకు అందేలా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. రెండు ప్రాజెక్టుల నుంచి సాగునీళ్లను వదలడంతో పాటు రామాయంపేట, సంగారెడ్డి, తుర్కపల్లి, జగదేవ్‌పూర్ కాలువలు, చెరువులు, కుంటలను నింపాలని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్‌కు ఒక్క ఫోన్ చేస్తే నీళ్లను వదలడంతో లక్షలాది ఎకరాల్లో పంటలు పండడంతో రైతులు సంతోషంగా ఉన్నరన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే రైతుల పక్షాన ఉద్యమిస్తామన్నారు.