హైదరాబాద్, డిసెంబర్ 8(నమస్తే తెలంగాణ): ఫ్యూచర్ సిటీలో జూపార్క్ ఏర్పాటుకు నిర్ణయించిన రేవంత్ సర్కార్ ఈ మేరకు ముఖేశ్ అంబానీకి చెందిన ‘వంతారా’ సంస్థతో ఒప్పందం చేసుకుంది. గుజరాత్లో అటవీ జంతువులకు వైద్యసేవలు అందిస్తున్న సంస్థ ఇక్కడ కూడా సేవలు అందించాలని సీఎం కోరడంతో గ్లోబల్ సమ్మిట్లో సోమవారం సంస్థ బృందం అటవీశాఖ తో ఎం వోయూ కుదుర్చుకున్నది. కాగా, జూపార్క్లు, అడవులను వంతారాకు ఇవ్వడంపై ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, సీఎం మా త్రం ఉత్సాహం చూపుతుండడంపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ జూపార్క్ మె యింటెనెన్స్ను సంస్థకు అప్పగించడాన్ని రాహుల్ తీవ్రంగా తప్పుబట్టడమే కాకుండా అది జూపార్క్ల ప్రైవేటీకరణకు అడుగులని దుయ్యబట్టారు. అయితే రాజధానిలో రాహుల్ వ్యతిరేకిస్తున్న సంస్థకు తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు మాత్రం దగ్గరుండి బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.