Suryapeta | సూర్యాపేట : తెలంగాణలో సంచలనం సృష్టించిన సూర్యాపేట పరువు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తన చెల్లి తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుందని చెప్పి.. ఆమె భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే తన భర్త వడ్లకొండ కృష్ణ(మాల బంటి) హత్యపై భార్య భార్గవి సంచలన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
‘తన నానమ్మ కళ్లలో ఆనందం కోసమే నా భర్త కృష్ణను మా అన్నయ్య చంపేశాడు. కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకున్నావని మా నానమ్మ చాలాసార్లు కొట్టింది. ఆమెకి కుల పిచ్చి ఎక్కువ. మా అన్నను రెచ్చగొట్టింది మా నానమ్మనే. హత్య తర్వాత నా భర్త కృష్ణ డెడ్ బాడీని మా నానమ్మకు చూపించారు. నా భర్త హత్యకు కారకులైన మా నానమ్మకు, అన్నకు ఉరి శిక్ష వేయాలి’ అని భార్గవి డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
సూర్యాపేటలోని మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ, కోట్ల భార్గవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో వారికి ఇష్టం లేకుండా తమ సోదరిని వివాహం చేసుకోవడంతో రెండు నెలలుగా కృష్ణను అంతం చేసేందుకు భార్గవి సోదరులు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. పథకం ప్రకారం తాళ్లగడ్డకు చెందిన బైరు మహేశ్తో పాటు నల్గొండకు చెందిన మరో యువకుడి సాయం తీసుకున్నారు. అనుకున్నట్లుగానే బైరు మహేశ్ కృష్ణతో స్నేహం చేసినట్లు నటించాడు. ఈ పథకాన్ని ఈనెల 19న అమలు చేయాలని చూసినా కుదరలేదు. ఆ తర్వాత ఈనెల 27న రాత్రి కృష్ణకు ఫోన్ చేసి వ్యవసాయ బావి వద్దకు రమ్మని చెప్పాడు. ఆ తర్వాత భార్గవి సోదరులతో కలిసి కృష్ణను హత్య చేశారు.
ఈ హత్యలో ప్రధాన నిందితుడి నానమ్మ బుచ్చమ్మ హస్తం ఉన్నట్లు గుర్తించి పోలీసులు షాకయ్యారు. మనువరాలు భార్గవి ప్రేమ పెళ్లి ఆమెకు ఇష్టం లేదు. దీంతో కొద్ది నెలలుగా తన కుమారుడు, మనవళ్లను రెచ్చగొడుతూ హత్యకు పరోక్షంగా కారణమైనట్లు తెలుస్తుంది. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని కారులో వేసుకొని ఆత్మకూర్(ఎస్) మండలం పాత సూర్యాపేటలో బంధువుల ఇంటి వద్ద ఉన్న బుచ్చమ్మకు చూపించి సంతృప్తి పరిచారు. చివరికి పిల్లలమర్రి సమీపంలోని మూసీ కాల్వకట్టపై మృతదేహాన్ని వదిలేసి నిందితులందరూ పరారయ్యారు. ఈ ఘటనలో ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Marriages | ఎల్లుండి నుంచి మోగనున్న పెళ్లి బాజాలు..! శుభ ముహూర్తాలివే..!!
MLC Elections | పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల