Vaddiraju Ravichandra | బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్త కాదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్, హరీశ్‌రావు అనేక సార్లు జైలుకెళ్లారని తెలిపారు. ఎన్నిసార్లు కేసులు పెట్టినా సరే కాంగ్రెస్ వైఫల్యాలను నిలదీస్తూనే ఉంటారని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. రెండేళ్లుగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు చూస్తున్నారని తెలిపారు. సీరియల్ మాదిరిగా రోజుకో కేసు పేరుతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. హరీశ్‌రావు బొగ్గు స్కాం బయటపెడితే.. రాత్రిలోపే నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేరని స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును ఎంత వేధిస్తే.. తెలంగాణ సమాజం అంత ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని హెచ్చరించారు.
సింగరేణి బొగ్గు స్కాంపై విచారణ జరిపించాలని వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో డిమాండ్ చేస్తానని వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందని వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. కాంగ్రెస్ మోసాలను ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించామన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే రిపీట్ కాబోతుంది.. అందుకే మాపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.