హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ప్రధాని నరేంద్ర మోదీ బీసీ అయినప్పటికీ బీసీలకు న్యాయం చేయడం లేదని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని, చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఓబీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో నిర్వహించిన సదస్సుకు రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిటైర్ ఐఏఏస్ అధికారి చిరంజీవులు ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సదస్సులో శాసన మండలి వి పక్షనేత మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీఎమ్మెల్యే మధుకర్, బీఆర్ఎస్ నాయకులు శ్రవణ్, సుధాకర్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టి 11ఏండ్లు పూర్తయినా కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ లేకపోవడం, చట్టసభల్లో రిజర్వేషన్స్ కల్పించకపోవడం బాధాకరమన్నారు. జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న ఓబీసీలకు అన్ని రంగాలలో తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా త్వరలో ప్రారంభం కానున్న జనగణనలో కులగణన కూడా చేపట్టాలని డిమాండ్ చేశారు.
చట్టసభల్లో మహిళలతో పాటు ఓబీసీలకు రిజర్వేషన్ల అమలకు వీలవుతుందని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టకుండా, ఓబీసీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించకుండా, మహిళా రిజర్వేషన్లు అమలుచేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. చట్టసభల్లో మహిళా, ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన మొదట్లోనే తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు తీర్మానించి కేంద్రానికి సిఫార్సు చేసిన విషయాన్ని వద్దిరాజు గుర్తు చేశారు.
తెలంగాణ మంత్రి మండలిలో ఏడాదిగా ఖాళీగా ఉన్న 6 స్థానాల భర్తీ సందర్భంగా బీసీలకు ప్రాధాన్యతనివ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎంపీ డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో బీసీలకు సముచిత గౌరవం లభించిందని వివరించారు. అందరం మరింత ఐకమత్యంతో ముందుకు సాగడం ద్వారా చట్టసభల్లో రిజర్వేషన్లు సాధించుకుందామని ఓబీసీలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సదస్సులో మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాసర్, మాజీ ఎమ్మెల్యే అనిల్, ఓబీసీ నాయకులు సిద్ధేశ్వర్, డీ వేలాద్రి తదితరులు పాల్గొన్నారు.