భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచినా కాంగ్రెస్ సర్కార్ అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని దుయ్యబట్టారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి భంగపాటు తప్పదని అన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా బీఆర్ఎస్ విజయాన్ని ఆపలేరని స్పష్టంచేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్లోని పలు డివిజన్లలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒకటేనని, చోటేభాయ్.. బడేభాయ్లాగా రెండు పార్టీలకు ఎంపీలు ఉన్నా బీసీల రిజర్వేషన్లు ఇవ్వలేకపోయారని మండిపడ్డారు.
ఈ రెండు పార్టీలు ప్రాంతీయ పార్టీలను అణగదొక్కాలని చూస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో గెలువలేక కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ అభ్యర్థులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఆ పార్టీకి బుద్ధిచెప్తారని హెచ్చరించారు. రెండేండ్లలో కొత్తగూడెంలో తట్టెడు మట్టికూడా పోయని కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం డబ్బు సంచులతో వస్తు న్నారని, ఈ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి తగిన బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ… ఈ రెండేండ్లలో సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రూ.3వేల కోట్లతో పట్టణాలను అభివృద్ధి చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదేనని పేర్కొన్నారు.