హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ ) : తెలంగాణ పల్లెలు తిరిగి పునర్జీవం పొందడానికి కారకుడు, స్వరాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. తెలంగాణను దేశానికి ధాన్యాగారంగా మార్చి.. పల్లెలు పచ్చగా పరిఢవిల్లటానికి కేసీఆర్ కారకుడన్నది.. దేశమే గుర్తించిందని ఆయన పేర్కొన్నారు. విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ‘కారణజన్ముడి’ పాటను ఆదివారం సాయంత్రం వద్దిరాజు తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమకాలం నుంచి కేసీఆర్‌కు బాగా తెలుసునని ఆయన చెప్పారు. తెలంగాణ సమాజాన్ని అన్నిరంగాల్లో సమున్నతంగా నిలిపేందుకు దశాబ్దకాలం కృషిచేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని స్పష్టంచేశారు. అందుకే ఆయన కారణజన్ముడని కొనియాడారు. ఈ పాటను చిత్రీకరించిన ‘ఫస్ట్రీల్’ సంస్థను వద్దిరాజు అభినందించారు. ఫస్ట్ రీల్-2025 కారణజన్ముడి పాటతో ప్రారంభం కావడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, ఫస్ట్ రీల్ సంస్థ ఎండీ జూలూరి శివసాగర్, పాట రచయిత ఎం రజినీకాంత్, టీ సాయి ప్రవల్లిక తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం పాడిపంటలతోపాటు ఐష్టెశ్వర్యాలతో తులతూగాలని, ప్రజలు సుఖసంతోషాలతో ముందుకు సాగాలని శ్రీవారిని వేడుకున్నట్టు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. ఉగాది పర్వదినాన ఆదివారం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు స్వాగతం పలికి, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో, ప్రజాజీవితంలో నిండు నూరేండ్లు ఉండాలని ఆ దేవున్ని కోరుకున్నానని తెలిపారు. పూజల్లో ఎంపీ వద్దిరాజు సతీమణి విజయలక్ష్మి, కుమార్తె డాక్టర్ గంగుల గంగాభవాని, కుమారుడు నిఖిల్ చంద్ర పాల్గొన్నారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో అన్ని మతాలకు సమప్రాధాన్యం ఇచ్చి.. గౌరవించారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సమాజానికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలు నెలరోజులు నియమ, నిష్టతో ఉపవాస దీక్షలు చేస్తారని అన్నారు. క్రమశిక్షణ, ప్రేమ, దయ, కరుణ, శాంతి, సహనం, సౌభ్రాతృత్వాన్ని ఇస్లాం బోధిస్తుందని తెలిపారు.