Revanth Reddy | ఎల్లారెడ్డి, అక్టోబర్ 28: కాంగ్రెస్ లాబీయింగ్ పార్టీగా మారిందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి విమర్శించారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసులో జైలుకు పోయినా వెంట నడిచానని, కోర్టుల చుట్టూ తిరిగానని గుర్తు చేసుకున్నారు. నమ్ముకున్న నలుగురు అనుచరులను కాపాడుకోలేని వాడు పీసీసీ అధ్యక్షుడా? అని ప్రశ్నించారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని తన నివాసంలో శనివారం అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో సుభాష్‌రెడ్డి ఉద్విగ్నంగా మాట్లాడారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మదన్మోహన్ను గెలవనివ్వనని శపథం చేశారు. రెబల్‌గా నామినేషన్ వేసి ఓడిస్తానని తేల్చిచెప్పారు. “రేవంత్‌రెడ్డీ.. నీవెంట తిరిగితే చేసింది గిదా? కార్యకర్తలు అభీష్టం మేరకు నేను బరిలో ఉంటాను. ఆరు గ్యారెంటీ పథకాలు అని చెబుతున్న రేవంత్‌రెడ్డీ.. నీవెంట ఉన్న నలుగురిని దక్కించుకోలేక పోతే నీవేమీ పీసీసీ అధ్యక్షుడివి” అని సుభాష్‌రెడ్డి ప్రశ్నించారు.