హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ప్రైవేట్ రంగంలోనూ ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని దక్షిణ భారత ఓబీసీ అసోసియేషన్ ముఖ్య సలహాదారుడు, తెలంగాణ మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న దక్షిణాది రాష్ర్టాలు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రకు పెద్దమొత్తంలో నిధులు కేటాయించాలని, ఆయా రాష్ర్టాల్లో ఎకువ సంఖ్యలో పరిశ్రమలను నెలకొల్పాలని కోరారు. బెంగళూరులో కేంద్ర పరిశ్రమలశాఖ మంత్రి జేడీ కుమారస్వామిగౌడను శనివారం ఆయన కలిశారు.
ఓబీసీ సంఘాల దక్షిణాది రాష్ట్రాల నేతలైన బాలరాజు గుత్తేదార్, శివకుమార్, ఓంకార్, గోపిగౌడ్తో ఆయన మంత్రిని కలిసి వివిధ అంశాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రం తరహాలో కర్ణాటకలోనూ అన్నికులాలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మించాలని, నీరా పాలసీ రూపకల్పన చేయాలని కోరారు. మత్స్యకారులు, గొర్రెలు, మేకల పెంపకందారుల, విశ్వకర్మలు, చేనేత, కల్లుగీత కార్మికుల కోసం వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని కుమారస్వామికి శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తిచేశారు.