హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి హరీశ్‌రావుపై రాష్ట్రప్రభుత్వం చేసిన ఫోన్‌ట్యాపింగ్ ఆరోపణలు నిరాధారమనే విషయం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తేటతెల్లమైందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఈ తీర్పు రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్‌కు చెంపపెట్టని అభివర్ణించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హరీశ్‌రావుపై నమోదు చేసిన ఫోన్‌ట్యాపింగ్ కేసును గతంలోనే హైకోర్టు కొట్టివేసిందని గుర్తుచేశారు. పాలనను గాలికొదిలిన కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులను బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నదని మండిపడ్డారు.
హరీశ్‌రావుపై కుట్రలను తిప్పికొట్టాలి: దేవీప్రసాద్
ప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న హరీశ్‌రావుపై కాంగ్రెస్ సర్కార్ కుట్రలకు దిగుతున్నదని బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ మండిపడ్డారు. సుప్రీంకోర్టు క్లీన్చిట్ ఇస్తూ ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సర్కార్‌కు చెంపపెట్టులాంటిదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఏకమై హరీశ్‌రావుపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
బురదజల్లడం దుర్మార్గం: ఎర్రోళ్ల శ్రీనివాస్
ప్రజాసమస్యలపై అడుగడుగునా ప్రభుత్వాన్ని నిలదీస్తున్న హరీశ్‌రావుపై కాంగ్రెస్ పెద్దలు ఫోన్‌ట్యాపింగ్ పేరిట బురదజల్లడం దుర్మార్గమని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఖండించారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు క్లీన్చిట్ ఇవ్వడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ నిరాధార ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. లేదంటే ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధిచెబుతామని హెచ్చరించారు.
క్లీన్చిట్ శుభపరిణామం: పల్లె రవికుమార్
ఫోన్‌ట్యాపింగ్ కేసులో హరీశ్‌రావుకు సుప్రీంకోర్టు క్లీన్చిట్ ఇవ్వడం శుభపరిణామని కల్లు గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే కాంగ్రెస్ సర్కార్ హరీశ్‌రావుపై అక్రమ కేసు బనాయించిందని ధ్వజమెత్తారు.