హైదరాబాద్, మార్చి 30(నమస్తే తెలంగాణ) : ఆరు గ్యారెంటీలకు ఘోరీ కట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కేసీఆర్‌ను దూషించడమే పనిగా పెట్టుకున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జోగు రామన్నతో కలిసి మాట్లాడారు. అక్రమ మైనింగ్‌తో ప్రజాధనాన్ని లూటీ చేసిన మంత్రి పొంగులేటిపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆధారాలతో ఆరోపణలు చేస్తే, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టి కేసీఆర్ రాజీనామాకు డిమాండ్ చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. పొంగులేటిపై అవినీతి ఆరోపణలకు, కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి ఏం సంబంధమని ప్రశ్నించారు.
ప్రాణాలకు తెగించి కేసీఆర్ తెలంగాణ సాధించారని గుర్తుచేశారు. పదేండ్ల అద్భుత పాలనతో వందేండ్ల తెలంగాణకు పునాది వేసిన గొప్ప నాయకుడని, కాంగ్రెస్ నేతలకు పదవుల భిక్ష పెట్టిన ఘనత ఆయనకే దక్కిందని చెప్పారు. కానీ అలాంటి మహానేతపై సీఎం, మంత్రులు వ్యక్తిగత విమర్శలకు దిగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆయన త్వరలోనే ప్రజల్లోకి వస్తారని చెప్పారు. కొందరు మంత్రులు విలువైన భూములపై కన్నేసి రిటైర్డ్ అధికారులతో రికార్డులు తారుమారు చేసి ఇష్టారీతిన కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల వ్యవహారం చూస్తుంటే కేసీఆర్ తెలంగాణ తెచ్చింది ఇందుకోసమేనా అనే బాధ కలుగుతున్నదని పేర్కొన్నారు.
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో వనరుల దోపిడీ తప్ప సాధించిందేమీ లేదని మాజీ మంత్రి జోగు రామన్న నిప్పులు చెరిగారు. జిల్లాల్లో కొందరు అధికారులు యథేచ్ఛగా అవినీతిపర్వానికి తెరలేపారని,అరికట్టాల్సిన సర్కార్ పెద్దలు చోద్యం చూడడం శోచనీయమని మండిపడ్డారు. హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని దెప్పిపొడిచారు. రాష్ట్రంలో పట్టపగలే నేరాలు, ఘోరాలు జరుగుతుంటే ప్రభుత్వం మాత్రం కబ్జాల వ్యవహారాల్లో మునిగితేలుతున్నదని ఎద్దేవా చేశారు.
నేరాలను అరికట్టేందుకు ఉపయోగించుకోవాల్సిన పోలీసు వ్యవస్థను ప్రత్యర్థులపై కక్ష సాధించేందుకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. మహిళలను మహారాణులను చేస్తామని గొప్పలు చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు రోడ్డుపైకి తెచ్చారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ రాగానే గన్‌కల్చర్ వచ్చిందని, సామాన్యులకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తంచేశారు.