హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ఉద్యోగులు పోరాటాలతోనే సమస్యలు పరిష్కరించుకోవాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. టీఎన్జీవో (తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం) కేంద్ర సంఘానికి ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేనీ, అసోసియేట్ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణను మంగళవారం తన నివాసంలో ఆయన ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా, ఏ ప్రభుత్వం వచ్చినా తమ హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులకు మేలు చేయడం సంఘాల ప్రధాన బాధ్యత అని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీవో సంఘం అగ్రభాగాన నిలిచి చరిత్రాత్మక పాత్ర పోషించిందని గుర్తుచేశారు.
ఉద్యోగుల సమస్యలు తీర్చడంలో సంఘం మరింత బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నదని పునరుద్ఘాటించారు. దేశంలోనే అత్యధిక జీతభత్యాలు కల్పించేలా నూతన పే-రివిజన్ కమిషన్ (పీఆర్సీ) తీసుకురావాలని, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్లను సకాలంలో అందించాలని, కాంట్రాక్టు ఉద్యోగులకూ పీఆర్సీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామన్న కాంగ్రెస్ హామీని గుర్తుచేశారు. ఓపీఎస్ అమలు చేసేలా ఒత్తిడి తేవాలని సం ఘం నేతలకు సూచించారు. గచ్చిబౌలిలోని ఎన్జీవో ఉద్యోగుల భూములను కబ్జాల చెర నుంచి కాపాడి, వారికి భూములు కేటాయించే బాధ్యత కూడా సంఘాలపైనే ఉన్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో కస్తూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
కోశాధికారిగా ఉమాదేవి.. నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం
టీఎన్జీవో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా సత్యనారాయణగౌడ్, కస్తూరి వెంకటేశ్వర్లు, కోశాధికారిగా ఉమాదేవి ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడి మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ ఎస్ఎం హుస్సేనీ(ముజీబ్) ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మంగళవారం నూతన కార్యవర్గాన్ని నియమించారు. నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో జరిగిన కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉపాధ్యక్షులుగా సీహెచ్ నర్సింహాచారి, నర్సింహారెడ్డి, డీ రాము, కొండల్‌రెడ్డి, నిర్మలా రాజకుమారి, కార్యదర్శులుగా తిరుమల్‌రెడ్డి, నజీర్ అహ్మద్, రాగి శ్రీనివాస్, పీ శ్రీనివాస్, శైలజ, ఆర్గనైజింగ్ సెక్రటరీ జైపాల్ విజయ్‌కుమార్, ప్రచార కార్యదర్శిగా సర్దార్ హర్విందర్రెడ్డి, కార్గవర్గ సభ్యులుగా అనురాధ, గీతారాణి, సుభాష్‌చంద్ర ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వీరందరూ ప్రమాణ స్వీకారం చేశారు.