హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన 70% వాటా సాధిస్తామని, ఆ దిశగానే ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపిస్తున్నామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సెక్షన్ 3 మార్గదర్శకాల మేరకు తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణాజలాల పునఃపంపిణీకి సంబంధించి ఢిల్లీలో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణ మంగళవారం నుంచి పునఃప్రారంభమైంది.
ఈ విచారణలో తెలంగాణ తుది వాదనలు వినిపించేందుకు రాష్ట్ర అధికారులు, న్యాయవాదులతో కలిసి మంత్రి ఉత్తమ్ హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం 1,050 టీఎంసీల్లో 70% లెక్కన తెలంగాణకు 763 టీఎంసీలు కేటాయించాలని రాష్ట్రం తరపున సీనియర్ అడ్వకేట్ ఎస్ వైద్యనాథన్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపిస్తున్నారని తెలిపారు.
తెలంగాణ డిమాండ్ శాస్త్రీయమైనదని, అంతర్జాతీయ సహజ న్యాయసూత్రాల మేరకే నీటివాటాను కోరుతూ డిమాండ్లను ముందుకు పెడుతున్నామని వివరించారు. సగటు ప్రవాహాలపై మిగిలిన అదనపు నీటిని వినియోగించుకునే స్వేచ్ఛ కూడా తెలంగాణకు ఉన్నదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలను బేసిన్ వెలుపలికి భారీగా మళ్లించడాన్ని నిలువరించాలని ట్రిబ్యునల్‌కు విన్నవించినట్టు వెల్లడించారు. తెలంగాణ నీటిహకుల విషయంలో ఎక్కడా రాజీపడబోమని చెప్పారు. తెలంగాణ వాదనలు బుధవారం కూడా కొనసాగనున్నాయి.