హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకుని వరి కోతలు నిలిపి వేయాలని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతులకు సూచించారు. ఈ మేరకు మొంథా తుఫాన్ విస్తరిస్తున్న పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలు చర్యలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడు తూ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మీద తుఫాన్ ప్రభావం పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యం తడిసిపోకుండా చూడాలని, మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 8,342 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటివరకు 4,428 కేంద్రాలు ప్రారంభించగా, మిగిలిన 3,814 కేంద్రాల ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటివరకు 22,433 మంది రైతుల నుంచి 1,80,452 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు చెప్పారు.
హైదరాబాద్, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ): జొన్న, మక్క పంటలను మద్దతు ధర పథకంలో కేంద్రమే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. కేంద్రం కొనుగోలు చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సి వస్తున్నదని, ఆ భారం తమపై పడుతున్నదని తెలిపారు. పెసర, మినుము, సోయాబీన్ పంటలను కూడా కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం కేంద్ర వ్యవసాయశాఖమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తుమ్మల స్పష్టంచేశారు. రాష్ట్రంలో సీసీఐ సేకరిస్తున్న పత్తికి తేమ శాతం నిబంధనలో మార్పులు చేయాలని కోరారు.