వనపర్తి, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : పాలమూరుకు ప్రాజెక్టుపై నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతగల మంత్రిగా ఉండి, తప్పుడు వివరాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం దారుణమని బీఆర్ఎస్ నేతలు, ప్రజలు, రాజకీయ, నీటిపారుదలరంగ నిపుణులు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో బీఆర్ఎస్ సర్కార్ సాధించిన విజయాలను గుర్తుచేస్తున్నారు. ఇందులో ఏదుల రిజర్వాయర్ ప్రత్యేకతను సంతరించుకున్నది. త్వరగా పనులు పూర్తయిన అరుదైన రికార్డు సొంతం చేసుకున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ, రిజర్వాయర్ల నిర్మాణాలకు సహకరిస్తున్న గ్రామాలకు అభివృద్ధి నజరానాలను అందించి అండగా నిలిచింది. కేసీఆర్ హయాంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రధానంగా ఆరు రిజర్వాయర్లున్నాయి. అవి.. అంజనగిరి, వీరాంజనేయ (ఏదుల), వెంకటాద్రి (వట్టెం), కురుమూర్తిరాయ (భూత్పూరు), ఉదండాపూర్, కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లు. ప్రాజెక్టు నిర్మాణం సమయంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కుట్రలకు తెరతీసింది. పనులకు ఆటంకాలు కల్పించాలని చూసింది.
కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల మద్దతుతో పనులను పూర్తి చేసింది. వనపర్తి జిల్లా ఏదుల రిజర్వాయర్‌ను రూ.880 కోట్లతో 6.55 టీఎంసీల కెపాసిటీతో నిర్మించింది. నార్లాపూర్ నుంచి ఏదుల వరకు కేవలం ఒక కిలోమీటరు కాలువ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక్కడి నుంచి వట్టెం రిజర్వాయర్‌కు నీటి తరలింపు కోసం పనులు చేపట్టారు. కాలువలు, విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం, నీటి తరలింపునకు పది మోటర్లలో 5 మోటర్లను సిద్ధం చేశారు. ఏదుల రిజర్వాయర్‌లో 4,201 ఎకరాల భూములు ముంపునకు గురయ్యాయి. ఏదులతోపాటు బండరాయిపాకుల, రేవళ్లి, కొంకలపల్లి, నాగపూర్, శానాయిపల్లి గ్రామాల భూములు మునకలో ఉన్నాయి. ఏదుల రిజర్వాయర్ ఏర్పాటులో భూములిచ్చి సహకరించిన రైతులకు ప్రభుత్వం దాదాపు రూ.179 కోట్లు చెల్లించింది. రైతులను కార్యాలయాలకు తిప్పకుండా రైతుల ఖాతాలకు డబ్బులను నాటి సర్కారు చేరవేసింది. 3,601 మంది రైతులకు పరిహారం అందించింది. సమైక్యపాలనలో శ్రీశైలం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు దశాబ్దాలపాటు పరిహారం ఇవ్వని దుస్థితిని ప్రజలు, రైతులు మరిచి పోలేదు. కానీ 2016 జూన్ 11న పాలమూరు ఎత్తిపోతల పథకానికి నాటి సీఎం కేసీఆర్ కరివెనలో శంకుస్థాపన చేశారు. వీరాంజనేయ రిజర్వాయర్‌కు అప్పటి నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు 2016 మే 13న శంకుస్థాపన చేశారు.
భూసేకరణతోపాటు రిజర్వాయర్ నిర్మాణానికి సహకరించిన గ్రామాలకు ప్రభుత్వం అభివృద్ధి పనులతో నజరానాలు అందించింది. ప్రతిపక్షాలు ప్రాజెక్టులను అడ్డుకుంటూ రైతులను రెచ్చగొట్టినా.. రిజర్వాయర్ నిర్మాణంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడుగా ఉన్న సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వం తరపున రైతులకు భరోసా కల్పించారు. పనులను ఆటంకం లేకుండా చూశారు. ఇలా సహకరించిన గ్రామాలకు ప్రభుత్వం తరపు నుంచి రూ.2 కోట్లు మంజూరు చేయించి సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, పాఠశాలకు ప్రహరీ, మురుగు కాల్వల నిర్మాణం, అంగన్వాడీ భవనాలతోపాటు పలు పనులను చేయించారు.
పాలమూరు ప్రాజెక్టులో అంతర్భాగమైన ఏదుల రిజర్వాయర్ ముందు వరుసలో నిలిచింది. కానీ పాలమూరు ప్రాజెక్టుపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాటల్లో వాస్తవం లేదని విమర్శలు వెలువడ్డాయి. పూర్తిస్థాయిలో నిర్మాణం చేసుకున్న ఏదుల రిజర్వాయర్‌కు నీటిని పంప్ చేయించేందుకు రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రాలేదని ప్రజలు గుర్తుచేస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై ఇంతకాలం మౌనం పాటించిన కాంగ్రెస్ సర్కారు బీఆర్ఎస్ ధాటిని చూసి, మళ్లీ తప్పుడు ప్రచారాలను తెరపైకి తెస్తున్నదని మండిపడుతున్నారు.
రెండేండ్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన సాగుతున్నది. పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి తట్టెడు మట్టిని తీసిందా? ఏదుల రిజర్వాయర్ పని ఎప్పుడో పూర్తయింది. విద్యుత్ సబ్‌స్టేషన్, కాలువలు, రిజర్వాయర్, పంపింగ్ మోటర్లన్నీ సిద్ధమయ్యాయి. నార్లాపూర్ నుంచి కిలోమీటర్ కాల్వ తీస్తే.. ఏదుల రిజర్వాయర్‌లో నీరు చేరుతుంది. ఆ పనిని కూడా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాలేదు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలి. కాంగ్రెస్ అంటే ఏమిటో ప్రజలకు అర్థమైంది. మిగిలిన మూడేండ్ల్లలోనూ ఈ ప్రాజెక్టులో ఒక్క అడుగు పని కూడా జరగదని తెలిసిపోయింది.
ఏదుల రిజర్వాయర్‌కు అన్ని పనులు పూర్తయ్యాయి. కిలోమీటర్ కాలువ తీస్తే సాగునీరు అందుతుంది. 7 టీఎంసీల నీటి కెపాసిటీ ఉన్న రిజర్వాయర్‌కు నీరందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న ప్రయత్నం కూడా చేయలేదు. 90 శాతం పనులను పూర్తి చేసుకున్న రిజర్వాయర్‌కు నీరు రావాలంటే కుడికిళ్ల సమీపంలో పెండింగ్‌లో ఉన్న కాలువ తవ్వితే సరిపోతుంది. ఆ పని చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడంలేదు. అధికారపార్టీ నాయకులు అబద్ధాలు చెప్తూ ఎంతకాలం గడుపుతున్నారు. రెండేండ్ల రేవంత్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. కాంగ్రెస్ నేతల మాటలను ప్రజలు నమ్మరు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి కావాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి.