పాన్గల్/గోపాల్పేట/చండ్రుగొండ, జనవరి 27 : యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. గజగజ వణికించే చలిలో తెల్లవారుజామునే పరుగున సొసైటీల వద్దకు వచ్చి గంటలకొద్దీ క్యూలో నిల్చుండి యూరి యా తీసుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. తిండీతిప్పలు మాని వచ్చినా యూరియా దొరక్క సగం మంది నిరాశతో వెనుదిరుగుతున్నారు. వనపర్తి జిల్లా పాన్గల్ మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయానికి 750 బస్తాల యూరియా రాగా మంగళవారం మధ్యాహ్నం వరకు దాదాపు 800 మంది రైతులు క్యూలో నిలబడ్డారు. టోకెన్ల పంపిణీ లో ఆలస్యం కావడంతో ఆకలితో అన్నదాతలు అలమటించారు.
తమవెంట తెచ్చుకొన్న రొట్టెలను క్యూలోనే నిలబడి తినడం కనిపించింది. దిక్కుమాలిన ప్రభుత్వంలో యూరి యా కోసం ఇబ్బందులు తప్పడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. కాగా కొందరికి టోకెన్లు జారీ చేయగా.. మరికొందరికి యూరియా పంపిణీ చేశారు. మిగతా వారికి ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేస్తూ రైతువేదిక వద్ద రోడ్డుపై నిరసన తెలిపారు.
పోలీసులు వచ్చి సముదాయించడంతో ఆందోళన విరమించారు. వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయానికి మంగళవారం తెల్లవారుజామునే పలువురు చేరుకొన్నారు. ఆధార్, పాస్బుక్కుల జిరాక్స్లను క్యూలో ఉంచి గంటల తరబడి నిరీక్షించారు. భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలోని గ్రోమోర్ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు మంగళవారం ఉదయం నుంచే పడిగాపులు కాశారు. వానకాలం పంటల సమయంలోనే యూరియా కోసం ఇబ్బందులు పడ్డామని, యాసంగిలోనూ కష్టాలు పడాల్సి వస్తున్నదని పలువురు రైతులు ఆవేదన చెందారు.

వనపర్తి జిల్లా పాన్గల్లో రైతు వేదిక వద్ద యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిలబడి ఆకలితో రొట్టె తింటున్న రైతు