హైదరాబాద్, జూన్ 20(నమస్తే తెలంగాణ): కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు రైతువేదిక వద్దకు వస్తే యూరియా బుక్ చేసి ఇస్తామని రైతులకు అధికారులు సూచించారు. రైతులు అదే సమయానికి పెద్ద సంఖ్యలో చేరుకొన్నారు. క్షణాల్లో స్టాక్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ విషయం చెప్పగానే తీవ్ర ఆగ్రహానికి గురైన రైతులు రైతువేదికలోని ఫర్నిచర్‌ను ధ్వంసంచేశారు. యాప్‌లో పెట్టిన యూరియా నిమిషాల్లోనే ఖాళీ చూపించింది. బుకింగ్ ప్రారంభించిన రెండు, మూడు నిమిషాల్లోనే స్టాక్ అయిపోయినట్టు చూపించింది. ఇది కేవలం ఒక్క రామారెడ్డిలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నది. శనివారం అత్యధిక జిల్లాల్లో యూరియా యాప్ స్తంభించింది. రైతులు ఎన్నిమార్లు ప్రయత్నించినా ఓపెన్ కాలేదు. దీంతో రైతులు యూరియా బుకింగ్ కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యాప్ ఓపెన్ అయిన జిల్లాల్లో స్టాక్పెట్టిన నిమిషాల్లోనే నిల్ స్టాక్ అని చూపిస్తుండటం గమనార్హం. వర్షాలు పడిన తర్వాత యూరియా ఇస్తదనే నమ్మకం ఈ సర్కార్‌పై లేదని, అందుకే ముందుగానే యూరియా తీసుకెళ్తున్నట్టు రైతులు చెప్తుండటం గమనార్హం.
యాప్‌తో యమతిప్పలు
యూరియా యాప్‌తో రైతులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. కొన్నిచోట్ల ఓపెన్ చేయడంలో, మరికొన్ని చోట్ల బుకింగ్‌లో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇంకొన్ని చోట్ల రైతుల వివరాలు మ్యాచ్ కాలేదని ఎర్రర్ చూపిస్తున్నది. ఇంకొన్నిచోట్ల యూరియా బుకింగ్ పూర్తయిన తర్వాత హిస్టరీలో సదరు రైతులకు రిసిప్ట్ రావడంలేదు.
ఆందోళనలు తీవ్రతరం
ఇబ్బందులు భరించలేక యూరియా యాప్‌ను రద్దు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. యూరియా యాప్‌నకు వ్యతిరేకంగా రోజూ పలుచోట్ల ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఈ మేరకు యూరియా యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం మెదక్, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల, దోమకొండలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నిమిషాల్లోనే స్టాక్ మాయం
యూరియా స్టాక్ వచ్చిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే స్టాక్ నిల్ చూపుతున్నదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎరువుల షాపుల యజమానులు తమ సన్నిహితుల కోసం ప్రత్యేకంగా వ్యక్తులను ఏర్పాటుచేసి బుకింగ్ చేపిస్తున్నట్టుగా తెలిసింది. చదువుకొని, స్మార్ట్‌ఫోన్ కలిగిన రైతులు వెంటనే బుక్ చేసుకొంటున్నారు. ఫలితంగా అత్యధిక మంది రైతులకు యూరియా బుక్ కావడంలేదు. చదువుకోని, స్మార్ట్‌ఫోన్ లేని రైతులు బాధితులుగా మిగులుతున్నారు. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
రోజుకు రెండుసార్లే స్టాక్
యాప్ ద్వారా రైతులు తమ ఇంట్లో కూర్చొని ఎప్పుడైనా యూరియా బుక్ చేసుకోవచ్చంటూ గతంలో సర్కార్ పెద్దలు గొప్పలు చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కానరావడం లేదు. రోజులో రెండుసార్లు మాత్రమే యాప్‌లో యూరియా అందుబాటులో ఉంటుంది. ఉదయం 6 గంటలకు ఒకసారి, మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు ఒకసారి స్టాక్ పెడుతున్నారు. స్టాక్ పెట్టిన నిమిషాల్లోనే ఖాళీ అవుతున్నది. ఆ తర్వాత యాప్‌లో నోస్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. దీంతో రైతులకు ఉదయం 6 గంటలకు యూరియా బుక్ కాకపోతే, మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు వరకు వేచి ఉండాల్సిందే. అప్పటికీ బుక్ కాకపోతే మరుసటి రోజు వరకు వేచి ఉండాల్సిందే.
ఒక్కో జిల్లాకు ఒక్కోసారి
ఒక్కో జిల్లాకు ఒక్కోసారి ప్రభుత్వం యూరియా యాప్ యాక్సెస్ ఇస్తున్నది. అంటే అన్ని జిల్లాల రైతులు ఒకేసారి యూరియా యాప్‌ను ఓపెన్ చేసి బుక్ చేసుకోలేరు. ఇందులో భాగంగా తొలుత నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, నల్లగొండ జిల్లాలకు యూరియా యాప్ యాక్సెస్‌ను కల్పించిన ప్రభుత్వం.. ఈ నెల 14న సంగారెడ్డి జిల్లాకు, 15న సిద్దిపేటకు, 18న యాదాద్రి-భువనగిరి జిల్లాకు అందించినట్టు తెలిసింది. ఇలా ఒక్కో జిల్లాకు ఒక్కోరోజు యాక్సెస్‌ను ఇస్తున్నది. జిల్లాలోనూ మండలాలు, డివిజన్ల వారీగా విభజించినట్టుగా తెలిసింది. కొన్ని మండలాల్లో యూరియా బుకింగ్ ఇస్తుండగా మరికొన్ని మండలాల్లో ఇవ్వట్లేదని తెలిసింది.
యూరియాను సర్కార్ దాస్తున్నదా?
రైతులకు పంపిణీ చేయాల్సిన యూరియాను సర్కార్ దాచుకొంటున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు కొత్త స్టాక్‌ను బయటకు తీయనే లేదని తెలిసింది. యాసంగిలో మిగిలిన స్టాక్‌నే కొంచెం కొంచెం జిల్లాల వారీగా యాప్‌లో పెడుతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే యాక్సెస్ ఇచ్చిన మండలాల్లో కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే పెడుతుండటంతో వెంటనే ఖాళీ అవుతున్నట్టుగా తెలుస్తున్నది. తర్వాత వచ్చే కొరతను నిలువరించేందుకు అధికారులు ఇలా చేస్తున్నట్టుగా తెలిసింది. వాస్తవానికి మార్క్‌ఫెడ్ వద్ద యూరియా బఫర్‌స్టాక్ 5 లక్షల టన్నులు ఉండాలి. కానీ, ప్రస్తుతం 2.15 లక్షల టన్నులు మాత్రమే ఉన్నట్టుగా తెలిసింది. ప్రైవేటు డీలర్ల వద్ద మరో లక్ష టన్నులు ఉన్నట్టుగా సమాచారం. ఒక్కసారి వర్షాలు కురువడం మొదలైతే ఈ స్టాక్ 15-20 రోజుల్లోనే ఖాళీ అవుతుందని, ఆ తర్వాత మళ్లీ కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నదని అధికారులు ఆందోళనలో ఉన్నట్టుగా తెలిసింది.