హైదరాబాద్, జూలై 8 (నమస్త తెలంగాణ) : రాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి నడ్డాకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. వానాకాలం సీజన్లో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి తెలంగాణకు రావాల్సిన 5 లక్షల టన్నుల యూరియాకుగానూ 3.07 లక్షల టన్నులు సరఫరా అయినట్టు కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
మరో కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. జహీరాబాద్ ఇండస్ట్రీయల్ స్మార్ట్‌సిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. వరంగల్ విమానాశ్రయానికి ఆర్థిక సహాయం చేయాలని, హైదరాబాద్-బెంగళూరు ఏరో డిఫెన్స్ కారిడార్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం బుధవారం కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు.