12 శాతం కమీషన్లపై ఉన్న ప్రేమ యూరియా అందించడంలో లేదా?: పెద్ది సుదర్శన్‌రెడ్డి
ఖానాపురం, ఆగస్టు 20 : వ్యవసాయ ప్రణాళికను అమలు చేయడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం చెందిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట ఎరువుల గోదాము వద్ద సరిపడా యూరియా లభించకపోవడంతో గిరిజన రైతులు జాతీయ రహదారి 365పై 2 గంటలపాటు రాస్తారోకో చేపట్టగా, వారికి మద్దతుగా పెద్ది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ జిల్లా వ్యాప్తంగా 20వేల మంది రైతులు అర్ధరాత్రి నుంచే యూరియా కోసం పడిగాపులు కాయడం మఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సిగ్గుచేటని ఎద్దేవాచేశారు.
మంత్రులు, ఎమ్మెల్యేలకు 12 శాతం కమీషన్ల మీద ఉన్న ప్రేమ రైతులకు యూరియా అందించడంలో లేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ జూన్ ప్రారంభంలోనే రాష్ట్రవ్యాప్తంగా 50 శాతం యూరియా నిల్వలను, పంటల సాగుపై ముందే అంచనాలను సిద్ధం చేసేవారని గుర్తుచేశారు. పాకాల ఆయకట్టు రైతులు పండించన ధాన్యాన్ని టెండర్ల రూపంలో అమ్ముకుని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రూ.1100 కోట్లు అదనపు వసూలు చేసి కేసుల్లో ఇరుక్కుపోయి తిరుగుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు చెప్పినట్లే కలెక్టర్ చేయడం మూలంగానే వ్యవసాయ శాఖ అట్టర్‌ఫ్లాప్ అయిందని చెప్పారు. 50 శాతం పైగా భూములున్న కాంగ్రెస్ నాయకులకు అధికారులు టోకెన్లు పంపిస్తూ పేద రైతులను రోజుల తరబడి క్యూలో నిలబెడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా అందించి ఆదుకోవాలని, లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.