నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 7: రాష్ట్రవ్యాప్తంగా యూరియా బస్తాలకోసం రైతులు బారులు తీరుతూ అవస్థలు పడ్డారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కంకర బోర్డులోని పీఏసీఎస్ కేంద్రానికి 250 బస్తాల యూరియా రాగా 750 మంది రైతులు లైన్లో ఉండడంతో వాటిని ఎలా పంపిణీ చేయాలో అర్థంకాక అధికారులు, పోలీసులు తలలు పట్టుకున్నారు. కురవి సొసైటీలో మూడు రోజుల క్రితం కూపన్లు ఇచ్చిన రైతులకు ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్ దగ్గరుండి యూరియా పంపిణీ చేయించారు. గుండ్రాతిమడుగు, దంతాలపల్లి పీఏసీఎస్ వద్ద ఒక్కోరైతుకు ఒక్కోబస్తా చొప్పున అందజేశారు. నర్సింహులపేట పీఏసీఎస్ వద్ద రైతులు తిండీతిప్పలు మాని బారులుతీరారు. నెల్లికుదురు మండలం శ్రీరామగిరి, ఎర్రబెల్లిగూడెం సొసైటీ కేంద్రాల్లో పోలీసు పహరాలో యూరియా పంపిణీ చేశారు. బయ్యారం రైతువేదికలో తాగునీరు లేక తీవ్ర ఇబ్బందిపడ్డారు. వరంగల్ జిల్లా బంజరుపల్లిలోని ఫర్టిలైజర్ షాపువద్ద భారీ వర్షంలోనూ రైతులు లైన్లో నిలబడ్డారు. కరీంనగర్ జిల్లా వెన్కేపల్లి-సైదాపూర్ సింగిల్‌విండో వద్ద 600 మందికి రైతులు బారులు తీరారు. సీఐతోపాటు ఇద్దరు ఎస్ఐలు పర్యవేక్షించారు. వరంగల్ జిల్లా ఖానాపురం మీదుగా యూరియా లారీలు మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి తరలివెళ్తుండగా గమనించిన స్థానిక రైతులు ఎన్‌హెచ్ 365 జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ఎస్సై రఘుపతి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి ఆందోళనను విరమింపజేశారు.
మహబూబాబాద్, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ): ‘మీ మీద మన్ను పొయ్యా.. ఒక్క బస్తా ఇయ్యరా..! ఇదేమి ప్రభుత్వం’.. అంటూ ఓ మహిళా రైతు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులపై దుమ్మెత్తి పోసింది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం మహబూబాబాద్ కంకరబోర్డులోని పీఏసీఎస్‌లో అధికారులు యూరియా పంపిణీ చేపట్టారు. వారం క్రితం కూపన్లు తీసుకున్న రైతులు లైన్లో నిలుచున్నారు. ఒకే బస్తా ఇవ్వడంతో ఆగ్రహించిన మహిళా రైతు తనకు మూడు ఎకరాల భూమి ఉంటే ఒక బస్తా ఏమి సరిపోద్ది అంటూ ఆందోళనకు దిగింది. పోలీసులు బయటకు పంపడంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన మహిళా రైతు ‘మీ మీద మన్ను పొయ్య.. ఎందుకు మమ్మల్ని పరేషాన్ చేస్తున్నరు’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులపై దుమ్మెత్తి పోసింది. తిట్లు, శాపనార్థాలు చేస్తుండడంతో పోలీసులు అకడ నుంచి చల్లగా జారుకున్నారు.
కరీంనగర్ జిల్లా వెన్కేపల్లి-సైదాపూర్ సింగిల్‌విండో వద్ద యూరియా కోసం పోలీస్ పహారా మధ్య పెద్దసంఖ్యలో బారులు తీరిన రైతులు
కరీంనగర్ జిల్లా బూరుగుపల్లిలో యూరియా కోసం సీఎం రేవంత్‌రెడ్డికి దండం పెడుతున్న రైతు గర్వందుల కిషన్
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద బారులు తీరిన రైతులు, పరిస్థితిని పర్యవేక్షిస్తున్న ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బంజరుపల్లి ఫర్టిలైజర్ షాపు ఎదుట భారీ వర్షంలోనూ లైన్లో నిలబడిన రైతులు
మహబూబాబాద్ పీఏసీఎస్ వద్ద యూరియా కోసం ఎండలోనూ క్యూలో నిల్చున్న మహిళలు