Farmers | ఎల్లారెడ్డిపేట/ఇల్లంతకుంట, ఫిబ్రవరి 5: కాంగ్రెస్ పాలనలో రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. నాట్లు వేసి రెండు నెలలైనా యూరియా దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిటపేట పీఏసీఎస్ గోదాముకు లోడ్ వచ్చిందని తెలియగానే పోతిరెడ్డిపల్లి, రాగట్లపల్లి, నారాయణపూర్, బండలింగంపల్లి, హరిదాస్‌నగర్, దుమాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పరిస్థితిని గమనించిన అధికారులు పోలీసుల సాయంతో యూరియా పంపిణీ చేశారు.
పలుకుబడి ఉన్నోళ్లకే యూరియా ఇస్తున్నారని కొందరు రైతులు హమాలీలతో గొడవకు దిగారు. మరో లోడు వస్తుందని చెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అలాగే ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ పీఏసీఎస్ గోదాం వద్ద కూడా రైతులు బారులు తీరారు. సిరికొండ, దాచారం, రామోజిపేట, చిక్కుడువాని పల్లి, అనంతగిరి, తెనుగువానిపల్లికి చెందిన రైతులు ఉదయం నుంచే నిరీక్షిస్తున్నారు. సరిపడా యూరియా దొరక్క నిరాశతో వెనుదిరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎరువులు సకాలంలో అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఎరువులు వస్తాయని పీఏసిఎస్ సిబ్బంది నచ్చజెప్పి పంపించారు.
నాట్లేసి 45 రోజులైతుంది. వారం సంది యూరియా కోసం తిరుగుతున్న. ఎప్పు డు పోయినా స్టాక్ లేదు రేపు రమ్మంటున్నరు. ఇయ్యాళ్ల కూడా నేను వచ్చేసరికి బస్తాలైపోయినయ్. యాష్టకొచ్చి నిలదీస్తే నాకు టోకెనిచ్చిర్రు. మరి అడుగనోళ్ల సంగతేంది? ఎన్నడూ గింతగనం తిప్పలు పడలె.
చెన్నూర్, ఫిబ్రవరి 5: ఎలాంటి ఆంక్షలు, పరిమితి లేకుండా సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై బుధవారం పత్తి రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పత్తి రైతులు మాట్లాడుతూ వందలాది వాహనాలు వస్తే 40 నుంచి 50 మందికి టోకెన్లు ఇచ్చి వారి పత్తిని మాత్రమే కొంటున్నారని మిగతా రైతులంతా గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. చెన్నూర్ మార్కెట్ కమిటీ పరిధిలోని ఐదు జిన్నింగ్ మిల్లుల ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేసే పరిస్థితి ఉన్నప్పటీకీ సీసీఐ అధికారులు మాత్రం రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ప్రైవేట్ వ్యాపారులతో కుమ్మక్కై ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.