హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ) : ‘యూరియా బస్తాను ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.266కు విక్రయిస్తే మాకు గిట్టుబాటు కాదు. రూ.388కి అయితేనే విక్రయిస్తాం. లేదంటే మొత్తం అమ్మకాలను బంద్ చేస్తాం..’ ఇదీ మూడు రోజుల క్రితం సూర్యాపేట జిల్లా ఎరువుల డీలర్ల అల్టిమేటం. యూరియాను ఎక్కువ ధరకు విక్రయిస్తామని బహిరంగంగానే ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లాలో వ్యాపారులంతా బస్తాను రూ.400కు విక్రయిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. ‘యూరియా లేదు. మీ ఇష్టముంటే కొనండి.. లేదంటే వెళ్లిపోండి’ అంటున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా యూరియా ధరల మోత మోగుతున్నది. రైతులకు అందాల్సిన యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ కొరతను చూపిస్తూ అధిక ధరలకు అంటగడుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం ఒక్కో బస్తాను అన్ని ఖర్చులు కలిపి రైతులకు రూ.266కు విక్రయించాలి. కానీ, కొరతతోపాటు రవాణా, లేబర్ ఖర్చులంటూ ఒక్కో బస్తాను రూ.350 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారు. ఒక్కో బస్తాపై రూ.100 నుంచి రూ.134 వరకు అదనంగా బాదేస్తున్నారు.
ఈ వానకాలం సీజన్‌కు కేంద్రం నుంచి ఇప్పటివరకు 6.6 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉన్నది. ఇందులో 3.35 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేసిన కేంద్రం 3.25 లక్షల టన్నులకు కోత పెట్టింది. అంటే నాలుగు నెలల్లో రావాల్సిన యూరియాలో 50% కోత పెట్టింది. ఈ సమయానికి రాష్ట్రంలో సుమారు 5 లక్షల టన్నుల యూరియా నిల్వలు ఉండాలి. కానీ, 2.76 లక్షల టన్నులు మాత్రమే నిల్వ ఉన్నాయి. అంటే సగం నిల్వలకు కోత పడింది. ఈవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, వైఫల్యంతో రాష్ట్రంలో యూరియా కొరత విలయతాండవం చేస్తున్నది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ పనులను వదిలేసి యూరియా కోసం రోజుల తరబడి షాపుల ముందు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎరువుల షాపుల ముందు ఎక్కడ చూసినా రైతుల భారీ క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. గంటల తరబడి ఎండలో నిల్చోలేక రైతులు తమకు బదులుగా చెప్పులు, సంచులను క్యూలైన్లలో పెడుతున్నారు. ఇంతచేసినా అత్యధిక ప్రాంతాల్లో రైతులకు పరిమిత సంఖ్యలోనే యూరియా సంచులను ఇస్తున్నారు. కొన్నిచోట్ల ఎకరాకు ఒక బస్తా చొప్పున ఇస్తుండగా, మరికొన్ని చోట్ల ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ మూడు నాలుగు బస్తాలు మాత్రమే ఇస్తున్నట్టు రైతులు వాపోతున్నారు.
వ్యవసాయ, మార్క్‌ఫెడ్ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కయినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాసులకు కక్కుర్తి పడుతున్న అధికారులు సహకార సంఘాల్లో విక్రయించాల్సిన యూరియాను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వ్యాపారులతో కలిసి బ్లాక్‌మార్కెట్ దందా సాగించడంతోపాటు యూరియాను సరిహద్దులు దాటిస్తున్నట్టు తెలిసింది. యూరియా దొరక్క తెలంగాణ రైతులు నానా తంటాలు పడుతుంటే.. మరోవైపు తెలంగాణ రైతులకు అందాల్సిన యూరియా పొరుగు రాష్ర్టాలకు యథేచ్చగా తరలిపోతున్నది. మంగళవారం ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న యూరియాను పోలీసులు పట్టుకున్నారు. రైతులకు సబ్సిడీపై ఇవ్వాల్సిన 150 బస్తాల యూరియాను రెండు లారీల్లో బ్లాక్ మార్కెట్ ద్వారా మహారాష్ట్రకు తరలించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే పదుల సంఖ్యలో లారీల ద్వారా యూరియా సరిహద్దులు దాటినట్టు సమాచారం. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. యూరియా కొరతను పరిష్కరించేందుకు కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
సంప్రదాయ (గుళికల) యూరియా కొరత ఏర్పడుతుండటంతో వ్యాపారులు రైతులకు నానో (లిక్విడ్) యూరియాను కట్టబెడుతున్నారు. కొన్నిచోట్ల నానో యూరియా కొనుగోలు చేస్తేనే గుళికల యూరియా ఇస్తామని షరతులు పెడుతున్నట్టు రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వాస్తవానికి రైతులు నానో యూరియాను పెద్దగా నమ్మడం లేదు. అది పంటకు ఏ మేరకు మంచి చేస్తుందనే అంశంపై వారికి సందేహాలున్నాయి. దీంతో నానో యూరియా కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నారు. కానీ, వ్యాపారులు మాత్రం రైతుల ఇబ్బందులు, సమస్యలతో సంబంధం లేకుండా నానో యూరియాను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది.