Chiranjeevi | ఉగాది సందర్భంగా హైదరాబాద్లో ఘనంగా నిర్వహించిన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేడుకలో చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. కళాకారులను గౌరవించే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొంటూ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేడుక మార్చ్ 19న ఉగాది సందర్భంగా హైటెక్స్ లో ఘనంగా జరిగింది. 2025 సంవత్సరానికి గాను ప్రకటించిన ఈ అవార్డుల ప్రదానోత్సవానికి సినీ, రాజకీయ ప్రముఖులు, అనేక మంది సెలబ్రిటీలు భారీగా హాజరయ్యారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి కు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ప్రదానం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చిరంజీవి ఈ గౌరవాన్ని అందుకున్నారు. అవార్డు స్వీకరించిన అనంతరం చిరంజీవి తన ప్రసంగంలో పలువురు విజేతలకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. కళాకారులు ఎక్కడ గౌరవించబడతారో ఆ రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుంది అనే నానుడి ఉంది. ఆ భావాన్ని అర్థం చేసుకుని ఆగిపోయిన అవార్డులకు పునర్జీవం పోసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ గారికి ధన్యవాదాలు, అని అన్నారు. అలాగే పక్క రాష్ట్రంపై కూడా చిరు కొన్ని కామెంట్స్ చేశారు . మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటి సినిమాల పట్ల, కళాకారుల పట్ల ప్రోత్సాహం విషయంలో కొంత వెనుకంజలో ఉందనిపిస్తోంది. కాబట్టి సినిమాలకు దగ్గరగా ఉండే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రేరణగా తీసుకుని మరింత ప్రోత్సాహం ఇవ్వాలి. ఆ ప్రోత్సాహం వల్ల ప్రభుత్వానికి కూడా మంచి రెవెన్యూ వస్తుంది అని విన్నవించారు.
చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. సినీ రంగానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఎంత ముఖ్యమో మరోసారి ఆయన గుర్తుచేసినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వేడుకతో గద్దర్ ఫిలిం అవార్డ్స్ మళ్లీ వైభవంగా పునఃప్రారంభమవడం సినీ పరిశ్రమలో ఆనందాన్ని కలిగిస్తోంది.