న్యూఢిల్లీ, మార్చి 19 : పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇప్పటికే ప్రపంచ దేశాల్లో ఇంధన సంక్షోభ భయాలు నెలకొన్న వేళ యుద్ధం ప్రమాదకర మలుపు తిరిగింది. గ్యాస్ క్షేత్రాలు యుద్ధ క్షేత్రాలుగా మారడం ఆందోళన కలిగిస్తున్నది. బుధవారం ఇరాన్‌లోని అత్యంత ప్రధానమైన పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ దేశాల్లోని గ్యాస్ క్షేత్రాలే లక్ష్యంగా గురువారం విరుచుకుపడింది. ఖతార్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ఫెసిలిటీ అయిన రాస్ లఫాన్పై క్షిపణుల వర్షం కురిపించింది. ఎర్ర సముద్రంలోని సౌదీ రిఫైనరీపైనా దాడి చేసింది. రెండు కువైటీ చమురు రిఫైనరీలను దగ్ధం చేసింది. తన ప్రధాన సహజ వాయువు క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడులకు తెగబడింది. పశ్చిమాసియాలో యుద్ధం ప్రపంచ ఇంధన సంక్షోభ భయాలను పెంచడంతో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్ 114 డాలర్లకు చేరుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు సమీపంలో ఓ నౌక తగలబడి పోగా ఖతార్‌కు సమీపంలో మరో నౌక ధ్వంసమైంది. హొర్ముజ్ జలసంధి గుండా నౌకల రవాణాపై ఆంక్షలు విధించిన ఇరాన్ అమెరికా రక్షణ బలగాలకు ఆశ్రయమిస్తున్న దేశాలపై దాడులు చేస్తామని ఇదివరకే హెచ్చరించింది. హొర్ముజ్ జలసంధి మార్గాన్ని నివారించడానికి ఎర్ర సముద్రం మీదుగా నౌకలను తరలించడానికి సౌదీ అరేబియా పెద్ద ఎత్తున చమురును పంపింగ్ చేస్తున్నది.
అయితే ఎర్ర సముద్రం రేవు నగరం యాన్బులోని ఎంఆర్ఈఎఫ్ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడి జరపడంతో ఆ మార్గంలో భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇరాన్ క్షిపణులు దాడి చేయడంతో మంటల్లో చిక్కుకున్న ప్రధాన ఎల్ఎన్జీ సదుపాయాన్ని అగ్నిమాపక శకటాలతో కాపాడినట్లు ప్రపంచ మార్కెట్లకు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌ను సరఫరా చేసే ఖతార్ తెలిపింది. గతంలో జరిగిన దాడుల తర్వాత అక్కడ ఉత్పత్తి నిలిచిపోయినప్పటికీ ప్రస్తుత దాడులు భారీ నష్టాన్ని చేకూర్చినట్లు ఖతార్ పేర్కొన్నది. ఇరాన్ యుద్ధం ముగిసినా ఖతార్ నుంచి ప్రపంచ మార్కెట్‌కు ఎల్ఎన్జీ సరఫరా ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. కువైట్‌లోని మీనా అల్ అహ్మదీ రిఫైనరీపై కూడా ఇరాన్ డ్రోన్ జరిగింది. మంటలు చెలరేగినప్పటికీ ప్రాణనష్టం వాటిల్లలేదని కునా వార్తాసంస్థ తెలిపింది. పశ్చిమాసియాలోనే అతి పెద్ద రిఫైనరీలో ఒకటైన ఇందులో రోజుకు 7.30 లక్షల బ్యారెళ్ల పెట్రోలియం ఉత్పత్తి జరుగుతుంది. డ్రోన్ దాడి జరిగిన తర్వాత సమీపంలోని మీనా అబ్దుల్లా రిఫైనరీలో మంటలు చెలరేగాయని అధికారులు చెప్పారు. బుధవారం రాత్రి ఇరాన్ జరిపిన భీకర దాడుల కారణంగా హబ్షన్ గ్యాస్ సదుపాయం, బాబ్ క్షేత్రంలో కార్యకలాపాలను మూసివేయవలసి వచ్చిందని అబూ ధాబీ తెలిపింది. ఇంధన సదుపాయాలపై ఇరాన్ దాడులను గల్ఫ్ దేశాలు తీవ్రంగా ఖండించాయి.
గల్ఫ్ దేశాలు, ఇజ్రాయెల్‌లో నిరవధికంగా క్షిపణి హెచ్చరిక సైరన్లు మార్మోగుతున్నాయి. ఇరానియన్ దాడులను ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ ఖండించాయి. తమ దేశంపై ఉన్న కొద్దిపాటి విశ్వాసం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని సౌదీ అరేబియాకు చెందిన ఓ దౌత్యవేత్త వ్యాఖ్యానించారు. అయితే ఇరాన్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. రియాద్, తూర్పు ప్రావిన్సులో ఆరు డ్రోన్లను సౌదీ అడ్డుకుంది. అయితే సమ్రీ రిఫైనరీపై ఇరాన్ జరిపిన దాడి భారీ నష్టాన్ని చేకూర్చినట్లు సౌదీ రక్షణ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్‌లో అనేక ప్రాంతాలపై ఇరాన్ క్షిపణి దాడులు సాగిస్తుండగా లక్షలాది మంది ఇండ్లను వీడి సహాయక శిబిరాల్లో తలదాచుకున్నారు. అనేక భవనాలు ధ్వంసం కాగా ప్రాణనష్టం పెద్దగా లేదు. తన సౌత్ పార్స్ సహజ వాయువు క్షేత్రంపై ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్, అరబ్ దేశాలపై భీకర దాడులకు పాల్పడుతున్నది. ఇరాన్లో ఉత్పత్తి అయ్యే విద్యుచ్ఛక్తిలో 80 శాతం సహజ వాయువు ద్వారానే వస్తున్నట్లు పారిస్‌కు చెందిన అంతర్జాతీయ ఇంధన సంస్థ తెలిపింది. ఇజ్రాయెల్ జరిపిన దాడి నేరుగా ఇరాన్ విద్యుత్తు సరఫరాలపై ప్రభావం చూపుతున్నది. సౌత్ పార్స్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ నియంత్రణలేని పర్యవసానాలకు ఇది దారి తీస్తుందని హెచ్చరించారు.

తక్షణమే తమపై ఇరాన్ దాడులు ఆపాలని గల్ఫ్ దేశాలు గురువారం విజ్ఞప్తి చేశాయి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని 12 గల్ఫ్, ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రులు ఓ సంయుక్త ప్రకటనలో ఇరాన్‌ను కోరారు. కాగా, అవసరమని భావిస్తే ఇరాన్‌పై సైనిక చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని సౌదీ అరేబియా ప్రకటించింది. ఇజ్రాయెల్, అమెరికా తన భూభాగంపై చేసిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. ఈ గల్ఫ్ దేశాల నుంచి తనపై దాడులకు పాల్పడితే దాన్ని అమెరికన్ భూభాగంగా తాను పరిగణిస్తానని ఇరాన్ ప్రకటించింది. కాగా, నివాస ప్రాంతాలు, చమురు సదుపాయాలు, ఉప్పు నీటిని మంచినీరుగా మార్చే ప్లాంట్లు, విమానాశ్రయాలు, నివాస భవనాలు, దౌత్య కార్యాలయాలతోసహా పౌర ప్రాంతాలపై ఇరాన్ దాడులు చేస్తున్నదని సంయుక్త ప్రకటనలో గల్ఫ్, ఇస్లామిక్ దేశాలు పేర్కొన్నాయి. అజర్బైజాన్, బహ్రెయిన్, ఈజిప్టు, జోర్డాన్, కువైట్, లెబనాన్, పాకిస్థాన్, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, తుర్కియే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన విదేశాంగ మంత్రులు ఈ సంయుక్త ప్రకటనపై సంతకాలు చేశారు. కాగా, మరో ప్రకటనలో సౌదీ అరేబియా ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. అరబ్, ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం తర్వాత సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజలల్ బిన్ ఫర్హాన్ ఓ ప్రకటన విడుదల చేస్తూ పలువురు దౌత్యవేత్తలు సమావేశమైన రోజున రియాద్‌పై ఇరాన్ దాడి యాదృచ్ఛికం కాదని చెప్పారు.