మిర్యాలగూడ, జనవరి 22 : ఆరుగాలం కష్టించి వరి సేద్యం చేస్తున్న అన్నదాతలకు యూరియా వెతలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి. పొలానికి వేయాల్సిన సమయంలో యూరియా వేయకపోవడంతో దిగుబడిపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గత ప్రభుత్వంలో ఎన్నడూ యూరియా కొరత రాలేదు.
ఉమ్మడి జిల్లా నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో ఈ యాసంగిలో దాదాపుగా 3.35 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. యూరియా వేసేందుకు రైతులు దుకాణాల చుట్టూ తిరిగినా యూరియా దొరకక రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. వ్యాపారులు అధిక ధరలకు విక్రయించాలన్న ఉద్దేశంతో యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సరిపడా యూరియా అందించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపిస్తున్నారు.