Rains In Telangana : పెరుగుతున్న ఎండలతో అల్లాడుతున్న తెలంగాణకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గుడ్న్యూస్ చెప్పింది. ఎండల నుంచి రాబోయే రోజుల్లో స్వల్ప ఉపశమనం కలగనుందని తెలిపింది. ఈ నెల 15, 16 తేదీల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ నెల 23 వరకు అనేక జిల్లాల్లో ఇలాంటి పరిస్థితే ఉండొచ్చని ఐఎండీ వివరించింది.
ఐఎండీ ప్రకారం.. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయి. తూర్పు, ఉత్తర తెలంగాణలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈదురు గాలులతోపాటు, భారీ వర్షపాతం కూడా నమోదవ్వొచ్చు. పెరుగుతున్న సగటు ఉష్ణోగ్రతలతోపాటు తేమశాతం పెరగడం కూడా ఈ మార్పులకు కారణాలుగా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే, వర్షాలు పడేవరకు ఎండల ప్రభావం ఎక్కువగానే ఉండనుంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ నెల 14 వరకు ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు, అకాల వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంగనర్, మహబూబ్ నగర్ జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణతోపాటు ఏపీలో కూడా ఇదేరకమైన వాతావరణం ఉండనుందని ఐఎండీ సైంటిస్టులు అంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ ప్రభావంతో కోస్తా తీరంలో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఈ నెల 15 నుంచి 17 వరకు వాతావరణం చల్లగా ఉండి, పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది.