e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Home Top Slides ఇవ్వన్ని ఆయన ఇచ్చినవి కాదా?

ఇవ్వన్ని ఆయన ఇచ్చినవి కాదా?

  • ప్రతి ఇంటికి మస్త్‌ ఇమ్మతయితుండు..
  • ఇదీ.. కేసీఆర్‌ పాలనపై ఓ పేదరాలి మాట
  • హైదరాబాద్‌లోని ప్రైవేటు దవాఖానలో అసక్తికర చర్చ

(కుకుట్లపల్లి రాకేశ్‌)
అది.. హైదరాబాద్‌ శివారు వనస్థలిపురంలోని సుష్మా థియేటర్‌ సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు దవాఖాన..సెప్టెంబర్‌ 8వ తేదీ రాత్రి 10 గంటల సమయం. ఐసీయూలో ఉన్న పేషెంట్ల సహాయకులు దవాఖాన మొదటి అంతస్తులో వేచి ఉన్నారు.
కొందరు భోజనాలు చేస్తుండగా.. ఇంకొందరు నిద్రపోయేందుకు ఉపయుక్తులై బెరైలు పడుతున్నారు. మరికొందరు సెల్‌ఫోన్లు చూస్తూ ఉండిపోయారు. అంతలోనే అక్కడకు ఓ మహిళ వచ్చింది.

‘మమ్మల్ని పట్టించుకుంటోలెవరు’ అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రారంభించింది. అక్కడే ఉన్న మిగతావారు కల్పించుకుని ‘ఏమైందమ్మా’ అని అడిగారు.‘నా భర్త జీహెచ్‌ఎంసీ రిటైర్డ్‌ ఉద్యోగి. పానం బాగలేక ఐసీయూల ఉండు. మాకే సాయం అందుతలేదు. కనీసం ఇన్సూరెన్స్‌ కూడా లేదు. ప్రభుత్వం సరిగా లేకనే ఈ పరిస్థితి వొచ్చింది’ అని కోపమైంది. తెలంగాణ ఒస్తే ఏం చేసిండమ్మా..? అంటూ ఇంకా నోరు పెంచింది.

- Advertisement -

అప్పటిదాకా అక్కడే ఓ మూలన తువాలు పర్చుకుని కూర్చున్నది దాదాపు 45 నుంచి 50 ఏండ్ల వయసున్న ఓ మహిళ. ఈమె మాటలు విని ఆమె.. మెల్లిగా లేచి తువాలు దులుపుకొని భుజం మీద వేసుకుని వాళ్ల దగ్గరకొచ్చింది. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న మహిళ దగ్గరకు వచ్చి ఆప్యాయంగా ఆమె భుజంపై చెయ్యేసి తనవైపు తిప్పుకొన్నది.
‘ఏమైందమ్మా.. నీకు ఏం కష్టమొచ్చింది’ అని అడిగింది.
‘మీది ఏ వూరు.. మీ సార్‌ ఏం చేసేటోడు’ అని మళ్లా ఆరా తీసింది.
‘నీకు కష్టమొచ్చిందని పెద్దాయనను తిడుతున్నవు. ఇదేమో ప్రైవేటు దవాఖానాయె.. అసలు నువ్వు సాయంకోసం దరఖాస్తు చేసుకున్నవా? ఇక్కడెవరో అధికారులు ఏదో చేస్తే పెద్దాయనను తిడుతున్నవు.. ఆయనేం చేసిండో తెల్వదా? ఏడేండ్లనుంచి ఒకదాని ఎంబడి ఇంకోటి చేసుకొంటు పోతూనే ఉన్నడాయె’ అంటూ సీఎం తీసుకొచ్చిన పథకాలన్నింటినీ ఆమెకు విడమర్చి చెప్పింది.
ఇంతకంటె మంచిగ ఒవడన్న చేస్తడా?
ఇప్పటిదాకా ఒవడన్న ఇంతకంటే మంచిగ చేసిండా?
నేనైతె ఇప్పటిదాక సూడలే. ఒవ్వడు చెయ్యలే గూడ.
ఊర్ల ముసలోళ్లకు మస్తు పింఛన్‌ పైసలు ఇస్తుండ్రు. ఇంతగనం ఎప్పుడన్న.. ఎవడన్న ఇచ్చిండా?
ఇప్పటిదాక ముసలోళ్లను సూడని కొడుకులు కూడా ఇప్పుడు మంచిగ సూస్తుండ్రు. ఎప్పుడన్న గిట్ల సూశిర్రా?
నెలకిన్ని పైసలొస్తయని ‘పానమెట్లుందమ్మా’ అని అడుగుతుండ్రు. గిట్ల ఎప్పుడన్న అడిగిర్రా?
ఇదంతా ఆయన చేస్తున్నది కాదా?
ఇంకేం ఇయ్యాలె?
ఇగ పెండ్లి చేసుకోంగనే లక్ష రూపాలకు ఎక్కువనే ఇస్తుండు.
కడుపయిన కాడికేని దవాఖాన్ల ఉట్టిగనే సూడవట్టె.
పిల్లనో, పిలగాన్నో కంటే 12 వేలు ఇయ్యవట్టె. కేసీఆర్‌ కిట్‌ ఇస్తుండె.
ఊర్లనే పిల్లలకు గుడ్లు, పిండి, పప్పులు, పాలు, బియ్యం ఇస్తుండు.
ఇగ గొల్లోళ్లకు గొర్లు పంచవట్టె. బంటోళ్లకు చేపలిచ్చే..
నిన్న మొన్న సాకలి, మంగలోళ్లకు పుకట్‌కే కరెంట్‌ ఇచ్చిండు.
చెరువులల్ల పనులు చేపించినంక.. నీళ్లతోటి నిండినయి.
పంటలు మస్తు పండుతున్నయి.. ఇదంతా కేసీఆర్‌ చేసిందేగా..
దళితులనైతె కడుపుల పెట్టుకొని సూసుకుట్టుండు.
ఒక్కో ఇంటికి పది లక్షలు ఇయ్యవట్టె. గింతగనం ఎవడన్నా ఇచ్చిండా.
ప్రతి ఇంటికి మస్తు ఇమ్మత్‌ అయితుండు..
ఇవన్నీ ఆయన ఇచ్చినవి కాదా?
ఉట్టిగనే ఎందుకు మాట్లాడుతున్నవ్‌..?
పనికిరాని ముచ్చట్లు ఎందుకు?
అన్నది

ఆమె మాటలు విని అక్కడున్నోళ్లంతా నివ్వెరపోయారు. ఆలోచనలో పడ్డారు. వ్యక్తిగతమైన కష్టాలొస్తే సీఎం ఏం చేస్తారు. చేతనైన కాడికంటే ఎక్కువే చేస్తుండుగా అని అన్నారు. అనడమే కాదు.. సర్కారు ఫలాలను వివరించిన ఆమెది ఏ ఊరని ఆరా తీస్తే.. తనది ఉమ్మడి నల్లగొండ జిల్లా చిట్యాల నుంచి దూరంగా ఉన్న ఓ పల్లెటూరని తెలిపింది. నాయినకు చికిత్స కోసం ఇక్కడకు వచ్చినట్టు చెప్పింది. ఆ మహిళ మాటలపై అక్కడ కాసేపు చర్చ జరిగింది. మా నాయినకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో అక్కడే ఉండి ఈ సంభాషణను నేను, నా మిత్రుడు జగదీశ్‌ జాగ్రత్తగా విన్నాం. తెలంగాణ స్వపరిపాలన జనం ముఖ్యంగా మహిళల్లో ఇంత చైతన్యం కలిగించిందా అనిపించింది. చర్చల్లో పాల్గొన్నవాళ్లలో ఎక్కువ మంది ముఖ్యమంత్రి కేసీఆర్‌ పని చేయగలిగిన దానికంటే ఎక్కువే చేస్తున్నారని అనుకోవడం వినిపించింది. అప్పటిదాకా ప్రభుత్వంపై కోపం చేసిన మహిళ కూడా ఏమనకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana