హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను నూటికి నూరుపాళ్లు ఆచరిస్తున్న నేల తెలంగాణ అని యూజీసీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ థోరట్ కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనా విధానాలే దేశానికి శ్రేయస్కరమని భావించటం వల్లే తెలంగాణ ప్రభుత్వం ఆ మహనీయుడికి 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని నిర్మించిందని అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, సమతా సైనిక్ దళ్, ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్స్ ఫోరమ్ సంయుక్తంగా ‘అంబేదర్ మహావిగ్రహ స్థాపన ధన్యవాద సభ’ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహావిగ్రహ స్థాపన, సచివాలయానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంపై దేశంలోని మేధావులు హర్షం వ్యక్తం చేశారు.
ఉన్నత విద్యా మండలి చైర్మన్, ప్రొఫెసర్ లింబాద్రి ప్రారంభోపన్యాసం చేయగా పద్మశ్రీ నర్రా రవికుమార్ అధ్యక్షత వహించారు. కన్వీనర్లుగా బీ శ్యామ్, దాసరి శ్యామ్ మనోహర్ వ్యవహరించారు. ఈ నెల 14న సుమారు 3 వేల మందితో సమతాదళ్ సైనికులతో మార్చ్ఫాస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని, పురానాపూల్ నుంచి అంబేద్కర్ విగ్రహం నుంచి భారీ శోభాయాత్ర చేస్తామని మేధావులు ప్రకటించారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన సుఖ్‌దేవ్ థోరట్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కేవలం రాష్ట్రంలోని అంబేద్కరిస్టులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ లక్ష్యాల కోసం పనిచేస్తున్న వారికి స్ఫూర్తినిచ్చారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చూపిన చొరవ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానాలు, ఆచరణ, జాతి నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర తదితర అంశాలపై ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. దేశంలో 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించిన సీఎం కేసీఆర్‌ను అభినందించారు. ప్రపంచంలోని అంబేద్కరిస్టుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా కేసీఆర్ పనిచేశారని శ్లాఘించారు.
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదపుటంచుల్లో ఉన్నదని థోరట్ ఆందోళన వ్యక్తం చేశారు. మత ప్రాతిపదికన పాలన ఉండకూడదని అంబేద్కర్ దూరదృష్టితో ఎందుకన్నారో ఇప్పుడిప్పుడే అర్థం అవుతున్నదని చెప్పారు. కేసీఆర్ లాంటి కొద్దిమంది పాలకులే అంబేద్కర్ ఆశయాల వెనుక దాగిన సత్యాన్ని గ్రహించారని తెలిపారు. అంబేద్కర్ దళిత పక్షపాతి మాత్రమే కాదని, ఆయన అన్నివర్గాల అభ్యున్నతికి పాటుపడిన ఆదర్శవాది అని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, రుగ్మతలను ముందుగానే గ్రహించి వాటికి పరిష్కారం చూపిన ప్రపంచ మేధావి అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ విలువలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరు కృషి చేసినప్పుడే ఆ మహనీయుడికి నిజమైన నివాళి అందించినట్టు అని వెల్లడించారు.
కేసీఆర్‌ది నిండు హృదయం
సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో క్రియాశీలకమైనది. ఈ నిర్ణయం ఈ రోజుది కాదు. దళితుల విషయంలో కేసీఆర్ నిండు హృదయంలో పనిచేస్తున్నారు. 1985లోనే కేసీఆర్ ఒక పల్లెటూరిలో దళితజ్యోతిని ప్రారంభించారు. 2003లోనే దళిత మేధావులను పిలిచి తెలంగాణ వస్తే ఏం చేయాలి అనే విషయం గురించి కూలంకషంగా చర్చించారు. అత్యంత పేదరికంలో ఉన్న దళితుల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఏమైనా చేయాలని అనుక్షణం పరితపించిన వ్యక్తి కేసీఆర్. సబ్‌ప్లాన్ కోసం ఎంతో సపోర్ట్ చేశారు. కానీ, కేంద్రం తీరని అన్యాయం చేసింది. సబ్‌ప్లాన్ స్వరూపాన్నే మార్చేసింది. 2016లోనే ఇంటికి రమ్మని సీఎం కేసీఆర్ పిలిచారు. రవీంద్రభారతికి కలిసి వెళదామని చెప్పారు. కానీ, ఆ ఏడు నిమిషాల గ్యాప్‌లోనే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు నిర్ణయం జరిగిపోయింది. ఈ దేశంలో అత్యంత పేదరికంలో వివక్షకు గురవుతున్నది దళిత జాతి అని కేసీఆర్ అనేకసార్లు చెప్పారు. సెంటర్ ఫర్ దళిత్ సెంటర్ ఏర్పాటు చేశారు. దేశంలోని ఏ సంస్థకూ ప్రభుత్వం భూమి ఇచ్చి దళితుల గురించి అధ్యయనం చేయాలని చెప్పలేదు. దళిత బంధు లాంటి పథకం ప్రపంచంలో ఎకడాలేదు. ఊరికి దూరంగా ఉన్న దళితులను తీసుకొచ్చి వ్యాపారులుగా మార్చిన గొప్ప దార్శనికుడు కేసీఆర్. 125 అండుగుల అంబేద్కర్ విగ్రహం, సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం కేసీఆర్‌కు అంబేద్కర్ వాదంపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.
– మల్లేపల్లి లక్ష్మయ్య, బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి
ఆకాశాన్ని ముద్దాడేంత మహా విగ్రహం
ఆకాశాన్ని ముద్దాడేంత మహా విగ్రహాన్ని నిర్మించడం దేశానికే గర్వకారణం. బుద్ధుడి విగ్రహానికి ఎదురుగానే, అంతకంటే ఎంతో గొప్పగా బాబాసాహెబ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయం. తెలంగాణ సమాజానికి, భారత సమాజానికి బాబాసాహెబ్ ఆలోచన నిత్యం మనసులో మెదులుతుంది. అనునిత్యం రాజ్యాంగ స్ఫూర్తి రగులుతుంది. సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరు పెట్టడం కేసీఆర్‌కు ఉన్న దార్శనికతకు నిదర్శనం. జ్ఞానం, సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛకు ప్రతిబింబంగా విగ్రహం నిలుస్తుంది. ప్రజాస్వామ్యాన్ని కోరుకొనే ప్రతి ఒక్కరికి బాబాసాహెబ్ స్ఫూర్తి ప్రదాత. అటువంటి మహనీయుడిని దేశంలోని పాలకులంతా నిర్లక్ష్యం చేశారు. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం ఇప్పుడే కాదు భవిష్యత్తు తరాలన్నింటికీ అంబేద్కర్ మహోన్నత్వాన్ని చాటేలా 125 అడుగుల భారీ విగ్రహాన్ని నిర్మించారు. దళిత సమాజంలో గుణాత్మక మార్పు రావాలని రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌ది. ఫలితంగా తెలంగాణలో చదువుకుంటున్న యువతుల శాతం గణనీయంగా పెరిగింది.
– ప్రొఫెసర్ లింబాద్రి, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్
అంబేద్కర్ విగ్రహం ఓ సందేశం
అంబేద్కర్ విగ్రహం ఒక సింబల్ కాదు. ఒక సందేశం. ప్రపంచంలో అంబేద్కర్‌కు, మిగిలిన మేధావులకు అనేక వ్యత్యాసాలు ఉన్నాయి. అనేకమంది ఆయా దేశాల కోసం ఉద్యమించినా, అంబేద్కర్ జీవన విధానం ఎంతో వేరు. కుటుంబాన్ని త్యాగం చేసి మరీ అంబేద్కర్ భవిష్యత్తు తరాల కోసం తాపత్రయపడ్డారు. వందేండ్ల తర్వాత ప్రజలకు ఏం కావాలి అనే దాని గురించి అప్పుడే ఆలోచించారంటే మామూలు విషయం కాదు. ప్రత్యేకించి దళితుల కోసం తీసుకున్న నిర్ణయాలు ఎంతో గొప్పవి. ప్రస్తుతం అంబేద్కర్‌ను కొందరికి మాత్రమే పరిమితం చేసే కుట్ర జరుగుతున్నట్టు కనిపిస్తున్నది. అంబేద్కర్ తాపత్రయం కేసీఆర్‌లోనూ కనిపిస్తున్నది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కోసం కేసీఆర్ చేసిన కృషి అనిర్వచనీయం. దేశంలోనే అతిపెద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం చరిత్రాత్మకం. అంబేద్కర్ విజన్‌పై కేసీఆర్‌కు ఉన్న నమ్మకానికి నిదర్శనం. – కాకి మాధవరావు, రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ
బుద్ధుడి బోధనలు, అంబేద్కర్ మార్గదర్శనంలో..
తెలంగాణ వచ్చిన తర్వాత 2, 3 నెలలకే దళిత ప్రొఫెసర్లను కేసీఆర్ ఇంటికి ఆహ్వానించారు. దళితులను ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై చర్చించాం. సెస్‌లో పీహెచ్డీ రిసెర్చ్ కమిటీ సమావేశం ఉండటంతో నేను ఆలస్యంగా వెళ్లాను. అక్కడేం జరిగిందని అడిగి తెలుసుకున్నారు. ఒడిశా విద్యార్థిని ఆసక్తికరమైన స్టడీతో ముందుకొచ్చిందని వివరించాను. దళిత విద్యార్థులకు అద్దెకు గదులు ఇవ్వటం లేదని, దీనివల్ల సుమారు ఒక తరం విద్యార్థులు చదువుకు దూరమయ్యారనేది సబ్జెక్టు అని చెప్తే కేసీఆర్ ఆశ్చర్యపోయారు. ఆ ఆలోచన నుంచి పుట్టినవే రెసిడెన్షియల్ కాలేజీలు. కేవలం దళిత విద్యార్థినుల కోసమే 33 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను అరగంటలోనే మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు. మళ్లీ 2016లో రమ్మంటే ఇంటికి వెళ్లాం. కొద్దిసేపు చర్చించి వెంటనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ఆదేశాలు ఇచ్చారు. సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టడం సంతోషంగా ఉన్నది. ఆ బుద్ధుడి బోధనలతో, అంబేద్కర్ మార్గదర్శనంలో సచివాలయంలో ఉత్తమ నిర్ణయాలు జరుగుతాయని కేసీఆర్ చెప్పేవారు. – ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్
జ్ఞానాన్ని పంచేందుకే..
దేశం ప్రమాదం వైపు నడుస్తున్నది. ఆరెస్సెస్ తన విషపు భావజాలాన్ని, మనుధర్మాన్ని బలవంతంగా ప్రజలపై రుద్దుతున్నది. అంబేద్కర్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నది. ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ర్టాల్లో బాబాసాహెబ్ పేరును పలకడమే నేరమన్న పరిస్థితి నెలకొన్నది. ఆయన పేరు లేకుండా చేసే కుట్రలు జరుగుతున్నట్టు కనిపిస్తున్నది. ఇటువంటి తరుణంలో అంబేద్కర్ ఏ చూపుడు వేలుతో జ్ఞానాన్ని అందించాడో, ఆ జ్ఞానాన్ని ఈ రోజు దేశానికి అందించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే 125 అడుగుల మహా విగ్రహాన్ని స్థాపిస్తున్నారు. చార్మినార్ వలే బాబాసాహెబ్ విగ్రహం కూడా హైదరాబాద్‌లో చరిత్రాత్మక కట్టడంగా మిగిలిపోతుంది.
– అల్లం నారాయణ, ప్రెస్ అకాడమీ చైర్మన్
ప్రాబ్లం ఆఫ్ రూపీ వేలం.. రూ.కోటితో ప్రారంభం
గ్రామోదయ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు ఢిల్లీ వసంత్ ఒక వేలం పాటను సభ ముందుంచారు. ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన అంబేద్కర్‌ను, ప్రపంచానికి ఆయన అందించిన ఆర్థిక పరిజ్ఞానాన్ని మరోసారి పరిచయం చేయాలని సంకల్పించారు. పాశ్చాత్య ప్రపంచంలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తన సాపేక్ష సిద్ధాంతానికి ప్రసిద్ధి చెందినట్లే, బాబాసాహెబ్ రచించిన ‘ప్రాబ్లెమ్ ఆఫ్ రూపీ’ గ్రంథం ఆధునిక అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ గ్రంథాన్ని వేలం పాడుదామని సూచించారు. ఈ నిర్ణయానికి అనుకూలంగా శామీర్‌పేటలోని సెయింట్‌పాల్స్ విద్యాసంస్థల చైర్మన్ సురేశ్ బెంజమిన్ రూ.కోటితో వేలం పాటను ప్రారంభించారు. ఈ వేలం పాట 6 నెలలు కొనసాగుతుందని, ప్రపంచంలోని ప్రముఖులను భాగస్వామ్యం చేద్దామని ఢిల్లీ వసంత్ సూచించారు. – ఢిల్లీ వసంత్
కేసీఆర్‌తోనే అంబేద్కర్ పాలన
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది. అణగారిన వర్గాల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. అంబేద్కర్ రాజ్యాంగం అమలు జరగడం లేదనే ఆందోళన దేశమంతా ఉన్నది. బాబాసాహెబ్ విజనరీని అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. అంబేద్కర్ చూపిన బాటలోనే సీఎం కేసీఆర్ పయనిస్తున్నారు. ఇదెంతో గొప్ప విషయం. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టాలని, సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ఎవరూ అడగలేదు. ఎటువంటి ఉద్యమాలు చేయలేదు. కేసీఆరే అంబేద్కర్ భావజాలాన్ని గుర్తించి చరిత్రాత్మిక నిర్ణయం తీసుకున్నారు. దేశాన్ని రక్షించుకోవాలంటే కేసీఆర్ వంటి నేత దేశ నాయకత్వంలో ఉండాలి. కేసీఆర్‌తోనే దేశంలో అంబేద్కర్ పాలన సాధ్యం.
– ఆరేపల్లి రాజేందర్, ఎస్సీ, ఎస్టీ నేషనల్ ఇంటలెక్చువల్ ఫోరం
అంబేద్కరిస్టుని అని గర్వంగా చెప్పుకోండి
దేశానికి ఏం కావాలో వందేండ్ల క్రితమే బాబాసాహెబ్ ఆలోచించారు. దశాబ్దాల తర్వాత ఎటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి? ప్రజలకు ఏం కావాలి? వంటి అనేక విషయాల గురించి ఊహించి రాజ్యాంగంలో పరిష్కారాలు పొందు పరిచారు. ప్రపంచంలోనే బాబాసాహెబ్ వంటి మేధావి మరెవరూ లేరు. తెలంగాణ సాధన మనకెంత ప్రత్యేకమో, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కూడా అంతే గొప్ప విషయం. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం భవిష్యత్తు తరాలకు ఒక విజ్ఞాన కేంద్రంగా నిలుస్తుంది. ఎంతోమంది అంబేద్కర్‌ను హృదయంలో పెట్టుకుని బయటికి చెప్పుకోని పరిస్థితులు ఉన్నాయి. ప్రతిఒక్కరూ గర్వంగా చెప్పుకోండి. నేను అంబేద్కరిస్టుని అని కాలర్ ఎగరేసి మరీ చెప్పండి. ఇంతటి ఆత్మవిశ్వాసాన్ని సీఎం కేసీఆర్ కల్పించటం సంతోషకరం.
– డాక్టర్ ప్రతాప్‌రెడ్డి, ఐఎంఏ మాజీ చైర్మన్
తీర్మానం: కేసీఆర్‌కు కృతజ్ఞతాభివందనాలు
‘అంబేద్కర్ విగ్రహాన్ని ఈ దేశం నడిబొడ్డున (హైదరాబాద్ దేశానికి నాభి వంటిది) హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠించడం దేశ ప్రజలందరికీ గర్వకారణం. నగరం మధ్యలో, బుద్ధుడి విగ్రహానికి దగ్గరలోనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించడం చరిత్రాత్మకం. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం మహోన్నత నిర్ణయం. ఈ రెండు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని మార్గదర్శకంగా నిలిచిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఈ సభ హృదయపూర్వకంగా అభినందిస్తున్నది. దళితబంధు వంటి నిర్ణయాలతో దళితుల సామాజిక వికాసానికి కృషి చేస్తున్న కేసీఆర్‌కు కృతజ్ఞతాభివందనాలు’ అని తెలుపుతూ తీర్మానం చేశారు. అందరూ కరతాల ధ్వనులతో ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే శ్రీనివాస్, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కే సీతారామారావు, పాలమూరు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్, తెలంగాణ మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ విజ్జులత, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి, తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్ గుప్తా పాల్గొన్నారు.