హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లు అమలు కావడానికి కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఒత్తిడి తేవాలని, లేని పక్షంలో తమ పదవులకు రాజీనామా చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. బీసీల రిజర్వేషన్ల బిల్లు అమలు కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్కు పంపిస్తే.. గవర్నర్ కూడా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ లాంటి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేస్తూ.. తెలంగాణలో మాత్రం అమలుకు బీజేపీ అడ్డుచెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదని పేర్కొన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు సాధించేందుకు ఈనెల 5న సీపీఎం ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని విజ్ఞప్తిచేశారు.