Telangana | హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 41,647 స్కూళ్లల్లో.. ఒక్కో తరగతికి 5.5లక్షల మంది విద్యార్థులున్నారు. అంటే సగటున ఒక పాఠశాలలో ఒక తరగతిలో విద్యార్థుల సంఖ్య 14లోపే. స్కూళ్లు ఎన్ని ఉన్నా తరగతికి 5.5లక్షల మంది విద్యార్థులనే పంచుకోవాలి. వాస్తవ పరిస్థితులిలా ఉంటే రాష్ట్రంలో 2030-31కల్లా కొత్తగా 4,291 సర్కారు స్కూళ్లను ప్రారంభించాలని తెలంగాణ విద్యాకమిషన్ సిఫారసు చేసింది. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, తెలంగాణ ఫౌండేషన్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని సూచించింది. మండలానికి మూడు పబ్లిక్ స్కూళ్లు, 4 తెలంగాణ ఫౌండేషన్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది.
మొదటి విడతలో 2025-26 విద్యాసంవత్సరంలో వంద నియోజకవర్గాల్లోని 100 మండలాల్లో పబ్లిక్, ఫౌండేషన్ స్కూళ్లను ప్రారంభించాలని విద్యాకమిషన్ సూచించింది. ఆరు విడతల్లో 4,291 స్కూళ్లను ఏడాదికి కొన్ని చొప్పున ఏర్పాటు చేయనున్నది. మొత్తం 632 మండలాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు రూ. 22,752కోట్లు, ఫౌండేషనల్ స్కూళ్లకు రూ, 8,848 కోట్ల చొప్పున రూ. 31,600కోట్లు ఖర్చవుతుంది. ఒక వైపు ఉన్న స్కూళ్లే విద్యార్థుల్లేక సతమతమవుతున్నాయి. మరోవైపు పుట్టే పిల్లలేమో తగ్గుతున్నారు. ఇప్పటికే 14 మంది విద్యార్థులకు ఒక స్కూల్ చొప్పున నడుస్తున్నప్పుడు, కొత్తగా 4వేల స్కూళ్లు తెరిచి ఏం లాభం అన్న వాదనలొస్తున్నాయి. కొత్తగా స్కూళ్లు తెరిస్తే చేరేదెవరు.. వచ్చేదెవరు. ఈ స్కూళ్లకు టీచర్లను ఎక్కడి నుంచి తెస్తారని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
ఒక్కో పబ్లిక్ స్కూల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య 1,500 అంటే ఒక మండలంలో 4,500 మంది ఈ పాఠశాలల్లోనే చేరుతారు. మండలానికి నాలుగు ఫౌండేషన్ స్కూళ్లను ఏర్పాటు చేస్తే, ఒక్కోదాంట్లో 250 మంది చొప్పున మొత్తం వెయ్యి మంది చేరుతారు. అంటే ఒక్కో మండలంలో 5,500 మంది వీటిల్లోనే ప్రవేశాలు పొందుతారు. రాష్ట్రంలోని 632 మండలాల్లో మండలానికి 5,500 మంది చొప్పున 34.76లక్షల మంది పబ్లిక్, ఫౌండేషన్ స్కూళ్లల్లోనే చేరుతారు. రాష్ట్రంలోని మొత్తం విద్యార్థులే 50లక్షలు. మిగిలింది 26 లక్షల మంది విద్యార్థులే. విద్యాశాఖ లెక్కల ప్రకారం ఇప్పటికే 35 లక్షల మంది ప్రైవేట్ బడుల్లో చదువుతున్నారు.
అంటే ప్రభుత్వ, జిల్లా పరిషత్ బడులకు సమాధి కట్టడం ఖాయంగా కనిపిస్తున్నది. రాష్ట్రంలో 491 మండలాల్లో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలున్నాయి. మరో 194 మండలాల్లో మాడల్ స్కూళ్లున్నాయి. మండలంలో ఒకటి రెండు గురుకులాలున్నాయి. దీంతో సర్కారు బడుల్లో ఎన్రోల్మెంట్ తగ్గిపోయింది. పిల్లలు లేక స్కూళ్లు మూతబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్ల రాకతో మళ్లీ ప్రభుత్వ, జిల్లా పరిషత్ స్కూళ్లపైనే ప్రభావం పడుతుంది. సర్కారు స్కూళ్లను వదిలించుకునేందుకు, మూసివేసేందుకు ఇది సర్కారు కొత్త ఎత్తుగడ అని టీచర్ల సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.